Saturday, December 8, 2007

జూ|| జంద్యాల

మొన్నామధ్య హీరో చిరంజీవి నటించిన ఒక పాత సినిమా చూసా. పేరు చంటబ్బాయ్. అందరికీ తెలిసే వుంటుంది, ఆ సినిమా లో శ్రీలక్ష్మి ది కవితలు చెప్పి జనాలని హింసించే ఒక విలక్షణమైన పాత్ర. కాని ఆ పాత్ర పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఒక సందర్భం లో ఆవిడ చెప్పే ఒక కవిత జీవన సారాన్ని చెప్తునే హాస్యం పండిస్తుంది. ఆ కవిత ..

"పుట్టేటప్పుడు మనిషికి జీవకళ


చచ్చేటప్పుడు మనిషికి ప్రేత కళ

మధ్యలో ఈ షోకులెందుకే శశికళ

నువ్వు కూడా వినవే చంద్రకళ"

వినటానికి కొంచెం ఎబ్బెట్టుగాను హాస్యం గాను వున్నా నాకు ఎందుకో ఈ కవిత బాగా నచ్చింది.
బాధని కోపాన్ని కూడ సున్నితమైన హాస్యం తో మిళితం చేయటం మహానుభావుడు జంద్యాల గారికే చెందింది. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే అంట కదా అని అడిగితే తెలుగు ఇంటిలో అప్పుడే పుట్టిన పాపయి కూడ "నిజమే రా అక్కుపక్షీ" అని తిట్టి మరీ చెపుతుంది. సినిమాలో బూతు లేకుండా తీయటం వీలు కాని పరిస్థితులలో వున్నప్పుడు కూడా, సున్నితమైన హాస్యాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆస్వాదిస్తారని నిరూపించిన వారు శ్రీ జంద్యాల.


ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి అంటే నా చిన్నప్పుడు నేను కవితలు రాయటం మొదలు పెట్టిన కొత్తల్లో మా ఫ్రెండ్ పి.పట్టభిరాం అని, నన్ను వేమన పద్యాన్ని తలపించేలాగ తన పేరు కలిపి ఒకటి చెప్పమన్నాడు. నేను కొంచెం ఎక్కువ స్పందించి వేమన పద్యాన్నే రీమిక్స్ చేసాను. అది ఉప్పు కప్పురంబు పద్యం. ఐతే అది పొరపాటున మా తెలుగు టీచర్ కంట్లో పడింది. ఆవిడ అది తరగతి లో అందరికీ వినిపించి నా చెవులకు మెలి పెట్టారు, పద్యాన్నిఅవహేళన చేసినందుకు. కాని నాకు మాత్రం చాల ప్రసంశలు వచ్చాయి క్లాసు లోంచి. నాకు జూ జంద్యాల గా ఒక బిరుదు కూడ ఇచ్చాడు మా పట్టభి గాడు. ఆ పద్యం ఏంటంటె ...

"ఉప్పు లేని పప్పు చప్ప చప్పగనుండు

చప్ప పప్పు తిన్న తిప్పలుండు

పప్పు లో తగినంత ఉప్పును వేయరా

సకల గుణాభి రామ, పి. పట్టాభి రామా."

Saturday, December 1, 2007

నేను పొయెట్ అయ్యానోచ్....

ఈ మధ్య నేను కవి నే కాకుండా పొయెట్ కూడ అయ్యానండోయ్.

అదేనండి ఆంగ్ల తవికలు అదే కవితలు రాస్తున్నా...

చదివినవారు బలే వున్నాయి కాని మళ్ళీ రాస్తే కొడతామన్నారు.


నేను అహింసా వాదిని కావటం చేత, ఎందుకులే అని నాలోని వీరావేసాన్ని ఆపుకున్నా.

కాని ఇది బ్లాగు కనుక, రాస్తే నన్ను కొట్టడానికి మీరు షికాగో రావాలి కనుక ధైర్యం ద్విగుణీకృతమై ఒకటి రాస్తున్నా.

నచ్చకపొతే మాత్రం నా పూచి కాదండోయ్

Ruddy hands & muddy feet
Gleaming swords & Glinting eyes
Rising Hopes & Thrilling Goals
We Stride in those Mazy paths
We are the Knights with gusty hearts …

Tuesday, April 3, 2007

యోధుడు

విశ్వమంతా కత్తి గట్టి ఎదురు నీకు నిల్చినా
బెదిరిపోకు వీరుడా నీ ఆశయం నెరవేర్చుకో
జగత్తంతా జట్టుకట్టి ముళ్ళు నీకు కట్టినా
అలసిపోకు ధీరుడా అనుకున్నది సాధించుకో
నిదుర ఎందుకు బడలికెందుకు
ఆకలెందుకు దాహమెందుకు
లక్ష్య సాధనలో....
సత్య శోధనలో.....

Wednesday, March 28, 2007

రాగం

స గ మ ని ద స ల సల్లాపము
అమృత పాన సంప్రాప్తము
మధుర గాన సుధా మయము

'ప,రి' రహిత పరి శోభితం, హిందోళం

Monday, March 19, 2007

విజయం

చీకటి పయనాలలో చిరుదీపం విజయం
అజ్ఞాన తిమిరంతో నిరంతరం సమరం

నిప్పు వలె స్వఛ్ఛమైన మనసుతో
నింగికెగసే ఉప్పెనంటి దీక్షతో
పట్టుదలనే పెట్టుబడిగ చేసి
సాధననే ఆయుధం గ మార్చి

పోరాటమె ఊపిరిగా గెలుపే లక్ష్యంగా
అదరక బెదరక సాగిపోయే బాటసారికి
శక్తినిచ్చి సేద తీర్చే మంత్రం.

పంచవటి

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

మానవ జన్మ ఒక వరం. ఏ యితర జీవికి లేని విచక్షణ జ్ఞానం, మనిషికి మాత్రమే వుండటం ఒక అదృష్టం.ఒక మనిషి అంతర్గత జీవనాన్ని, బాహ్య ప్రపంచంతో సమతుల్యం చేసే ప్రక్రియే కళ. సృష్టి ఆవిర్భావం మొదలు ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతూనే వుంది. ఈ ప్రక్రియకు కొలమానం వుండదు. ఎప్పటికప్పుడు దాని అవధులు పొడిగించబడతాయి. కాబట్టే కొత్తదనానికి లోటు లేదు. ఒక్కోసారి ఈ కళార్తి ఒక మనిషి జీవిత విధానన్నే మారుస్తుంది.

సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం మరియు శిల్పకళ అనబడే ఈ ఐదు కళా రూపలను మనవ జీవన సరళి కి అన్వయించుకునే ప్రక్రియకు నేను సైతం ఒక సమీకరణాన్ని కూర్చటానికి చేసే ఒక ప్రయత్నమే ఈ "పంచవటి".

ఇందులో ముఖ్య భాగం కథా సంపుటి. కొన్ని నిజజీవితపు సంఘటనలు, కొన్ని కల్పితాలతో కొంత హాస్యం మరికొంత వ్యగ్యం మిళితం చేసి మానవ మానసిక స్థాయీబేధాలను (human psychological levels) ప్రతిబింబించే రీతిలో కృషి చేయడమైనది. ఇవి వారానికి రెండు కధల చొప్పున ప్రచురింపబడతాయి. ఇంకా సంగీత, నృత్యానికి సంబంధించినంత వరకు ఆయా రంగాలలో ప్రముఖుల కృషి మొ ప్రచురించ పడతాయి.

సాహిత్యానికి కలికితురాయి కవిత్వం. ఒక్కొ సారి ఒక్కో విధంగా కవిత్వం పుడుతుంది. అలా ఆశువు గా వచ్చే కవితలె మనసుకు హత్తుకుంటాయి. కాబట్టి ఈ బ్లాగులో ఆశు కవిత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.

నా లో ఈ సాహితీ స్పృహ కి కారకులైన నా అమ్మకి నాన్నకి, ఈ ప్రయత్ననికి నాకు స్ఫూర్థిని యిచ్చిన శ్రీ నాగరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.