Thursday, June 16, 2016

పంచవటి విలాసము ఫేస్‌బుక్  కి మార్చబడినది.
https://www.facebook.com/panchavaty/

Monday, July 22, 2013

నా రాజ్యంలో ఒకరోజు

అది ఆదివారం కావటంతో బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతున్నాను. దూరం గా పక్షుల కిల కిలా రావాలు, కోకిలల కూహూ లు, గుర్రపు డెక్కల శబ్దాలు, మత్తేభ  ఘీంకారాలు వినిపిస్తున్నాయి. 'ఏంటో నా పిచ్చి గానీ మా ఇంటి పక్కన గుర్రాలు, ఏనుగులు ఎందుకుంటాయ్' అని కళ్ళు తెరవకుండా సరిపెట్టుకొన్నాను. ఇంతలో నా అలారం మోగింది "మత్తు వదలరా ..ముచికా... మత్తు వదలరా...". ఇదేంటి ఏదో తప్పుగా వినిపిస్తోంది అని కళ్ళు తెరిచి చూసాను. ఒక్క సారి నిర్ఘాంత పోయాను. ఏదో రాజుల అంత:పురంలో ఉన్నాను.

నా పక్కనే ఒకడు తంబుర పట్టుకొని "మత్తు వదలరా...ముచికా...మత్తువదలరా" అని పాడుతున్నాడు. నాకు అర్ధం కావట్లేదు. మణిమయ మంటపాలు, రత్న కాంతులీనే గోడలు, పట్టు పందిరి మంచం.... ఇదంతా  అయోమయం గా ఉంది. ఈలోపు "కర్తవ్యం నీ వంతు, పేకాడుట నా వంతు" ......   ఆ పాడుతున్న వాడు చెలరేగిపోయి ఆరునొక్క శృతి లో పాడుతున్నాడు.             

"ఒరే !!!!! ఆపరా బాబు. ఎవరు నువ్వు? పొద్దున్నే ఈ తప్పుడు పాటలేంటి. అసలు నేను ఎక్కడున్నాను?"  
"ముచికుంద మహారాజులకు శుభోదయము. అదేమిటి మహప్రభో!!!.. ఇది రోజూ మీకు పాడే మన జాతీయ మేలుకొలుపు పాట కదా. మీరు మీ మందిరంలోనే ఉన్నారు" అన్నాడు.
"మహారాజునా? ఇది ఏ కాలము నాయనా". 
"వర్షాకాలం మహారాజా" అన్నాడు వినయంగా.   
"ఎహె !!! అది కాదు నేనంటున్నది. ఇది యే సంవత్సరమని"అన్నాను. 
"రాక్షస నామ సంవత్సరము మహా రాజా" అన్నాడు అంతే వినయంగా. నాకు చిర్రెత్తింది.
"ఒరే ద్రాపీ .. ఇది రాజుల కాలమా?"
ఆ గాయకుడు బిత్తర చూపులు చూస్తూ భయం తో వణుకుతూ బయటకు పరిగెత్తాడు. ఇంతలో ఆకాశం దద్దరిల్లింది. "నరుడా, నీవు నిన్నటి రోజును మర్చి నట్టున్నావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో"
నా కళ్ళముందు రింగులు గింగిరాలు తిరిగాయి. ముందు రోజు సాయంత్రం వెంకన్న గుడి లో ఉన్నాను.

*      *      *

 భక్తి తో స్వామి కి దణ్ణం పెట్టుకొని, కళ్ళు మూసుకొన్నాను. 
"పుట్టింటోళ్ళు తరిమేసారు...అయ్యో పాపం పాపాయమ్మ" అంటూ జయమాలిని, ఎంటీఆర్ కళ్ళముందు కనిపించారు.    
"ఛి ఛీ !!! ఎంత అపరాధం. స్వామీ క్షమించండి. ఇకనుంచి తెలుగు సినిమాలు చూడటం  కాస్త తగ్గిస్తాను " అనుకొని మళ్ళీ కళ్ళుమూసుకొని తెరిచాను. 
ఎదురుగా ఒకాయన, తెల్ల పంచె కట్టుకొని, భగవంతునికి, భక్తుని అడ్డం గా ఉండే అంబికా దర్బారుబత్తిలా నుంచొని నాకేసి చిద్విలాసంతో చూస్తున్నాడు.
"అంకుల్ కొంచెం పక్కకి తప్పుకొంటారా" అన్నాను చిరుకోపంగా. 
"నరుడా!!! నేను దేవదూతను. నీ పని మీదే వచ్చాను", అన్నాడు.
నేను నమ్మలేకపోయాను. "నిజం గానా? మీరు దేవదూతని ఏంటి నమ్మకం. దేవతలంటే ఎన్నో మహిమలు ఉండాలి. మీకున్నాయా? ఏవీ రెండు చూపించండి" అన్నాను వ్యంగ్యంగా. 
అప్పుడు సడన్ గా నా రెండు చేతులూ నా ప్రయత్నం లేకుండానే లేచి నా రెండు దవడలని ఎడా పెడా రెండు పీకాయి.        
"అర్ధం అయ్యిందా నాయనా. నిన్ను ముట్టుకోకుండానే నీ దవడలు వాయగొట్టాను. అసలు ఒక దవడే వాయకొట్టొచ్చు. కాని ఇందాకా నన్ను అంకుల్ అని పిలిచినందుకు రెండోది అన్నమాట". అన్నాడు.
అయ్యబాబోయ్. నిజం గా దేవుడే. ఇప్పుడు ఏమి చెయ్యాలి. సినిమాల్లో ఐతే ఇలా దేవుడు  కనపడగానే పద్యాలు, పాటలు పాడతారు కదా అని "చేత వెన్న ముద్ద" పాడాలా, "బాబా బాబా బ్లాక్ షీప్" పాడలా అని దవడలు ఒత్తుకొంటూ అలోచిస్తున్నాను.    
నా మనసు గ్రహించిన దేవదూత "పద్యాలు ఏమీ వద్దు కానీ, నీ తపస్సుకి మెచ్చి దేవుడు నన్ను పంపించాడు. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.         
"తపస్సా? గట్టిగా ఐదు నిమిషాలు కింద కూర్చొని పూజ చేస్తే సర్వాంగాలు స్థంభించిపోయి లేవటం కూడా కష్టం నాకు" అని ఆశ్చర్య పోయాను.  
"ఆలాగుననా??? ... " అని ఎంతో ఆశ్చర్య పోయాడు సోకాల్డ్ దేవదూత.  
"అది ఏ లాగూనో తెలీదు. ప్రసాదం కోసం ఇలా గుడి కి రావటం తప్ప, నేనెప్పుడూ అగరొత్తులు కూడా వెలిగించలేదు"
"ఒక్క నిమిషము ఆగుము" అని కాసేపు కళ్ళు మూసుకొని తెరిచాడు. "పొరపాటయ్యింది, నేను కనిపించాల్సింది నీ వెనకాల వాడికి..." అని మాయమవ్వబోయాడు.
నేను దబ్బున ఆయన కాళ్ళు పట్టుకొని, "స్వామీ .... ఎలాగూ వచ్చారు కదా. ఏదో ఒక్క వరం ఇచ్చి వెళ్ళండి. కనీసం విశ్వరూపమైనా చూపించాల్సిందే" అని లాగడం మొదలు పెట్టాను.  
"ఒరే నాయనా! ఆపరా బాబు. ఆ పంచె ఊడితే విశ్వరూపం 3డి లో వ్యక్తమౌతుంది. లోపల అంగువస్త్రం కూడా లేదు. సరే ఏదైనా చిన్న వరం కోరుకో" అన్నాడు.  
"నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి" అన్నాను.    
"ఓరి రాక్షసుడా .... తెలుగు చిత్రాలు ఎక్కువ చూసినట్లున్నావు. అది ముడియాదు. వేరే ఏదైనా కోరుకో".   
"సరే, నేను మహారాజులా బ్రతకాలి స్వామీ" అని కోరుకున్నాను.        
ఆయన "తధాస్తు. రేపటికల్లా నువ్వు రాజువౌతావు" అని వెళ్ళిపోయాడు.
*    *    *

"అర్ధం అయ్యిందా నాయనా, అందుకే నువ్వు ఇప్పుడు రాజువయ్యావు. ఎంతకాలం అలా ఉండాలో నువ్వు అడగలేదు కాబట్టి నీకు ఈ యోగం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. అదిగో నీ మంత్రి వస్తున్నాడు. కాస్త వీళ్ళందరితోటీ రాజ భాష వాడు. లేకపోతే నీకు పిచ్చెక్కిందనుకొంటారు. ఇంక నేను ఉంటాను" అనగానే ఆకాశం మళ్ళీ మామూలుగా ఐపోయింది.    
"అదన్న మాట సంగతి. ఇప్పుడు నేను రాజునన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అందరూ ఆ గాయకుడిలా పరిగెడతారు" అని అనుకున్నాను. 

ఈలోపు అక్కడికి ముసలి మంత్రి వచ్చి "ముచికుంద మహారాజా .... మీ విద్యాభ్యాసానికి వేళ ఔతోంది" అన్నాడు.        
"వార్నీ ఇంతపొద్దున్నేనా" 
"మిట్టమధ్యాహ్నం కావస్తోంది ప్రభూ. పైగా మన రాజగురువు గారు ఆరుబైట మైదానంలో చకోరపక్షిలా వేచి ఉన్నారు ప్రభూ" అన్నాడు.      
చేసేది లేక, కాస్త మొహం కడుక్కొని, ఆ పంచెలు అవి కట్టుకొని, మైదానంలోకి వెళ్ళాను. బాగా గడ్డం పెంచుకొని ఉన్న ఒకాయన ఉన్నాడు. ఈయనే రాజగురువు కాబోలు. కాస్త దూరం గా ఒక 20 మంది నుంచొని ఉన్నారు. 

"నాయనా ముచికుందా, శుభోదయము" అన్నాడు రాజగురువు.
"శుభ ఈనాడు ! శుభ ఈనాడు! వీరంతా ఎవరు. విద్యార్ధులా?"
"మీ ఇతర విద్యల శిక్షకులు. అతను ఆశ్వ విద్య, ఇతను ఖడ్గ విద్య, ఇతను గద విద్య ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి" అన్నాడు రాజగురువు
"మరి మీరు"
"నేను విలువిద్యా శిక్షకుడను. ఔను అదేమిటి కొత్తగా అడుగుతున్నావు ముచికుందా?"  అన్నాడు రాజగురువు.
"చూడండి...నాదగ్గర ముచికలు, మూలికలు ఏమీ లేవు. నన్ను మామూలుగా పిలవండి" అన్నాను ఆవేశం గా.
"అలాగుననే ప్రభూ! ఈరోజు విద్యాభ్యాసానికి ముందు ఒక పని చేయవలెను"  అని అటు తిరిగి, "భీకరమల్లూ, ఆ ఆముదము రాజుగారికి ఇవ్వు" అన్నాడు రాజగురువు.  
"ఆముదం ఎందుకు?" అన్నాను.       
"మహారాజా, ఈ కడివెడూ ఆముదం తాగి బాగా వ్యాయామము చేసిన, మీ స్వేదరంధ్రాల్లోంచి మలినములు బయటకు వచ్చును"   
"ఏడ్సినట్లుంది. ఇంత ఆముదం తాగితే నవరంధ్రముల్లోంచి రక్తము వచ్చును. అవి ఏమీ వద్దు. విలువిద్య చాలు" అన్నాను.       
"కనీసం వ్యాయామము చేయుడు. అలా చేసిన మన భీకరమల్లు పొట్టలా మీకు కూడా షట్‌పొట్లములు వచ్చును. వీని పొట్టను ఒకసారి చూడండి" అన్నాడు రాజగురువు.
భీకరమల్లుడు వాడి నల్లని దేహాన్ని మరింత బిగించాడు. నిజంగానే వాడి పొట్టమీద సిక్స్ ప్యాక్ నిగనిగలాడుతూ కొట్టొచ్చినట్లు కనిపించింది.
"ఎలా ఉన్నది వాని సాధన" అన్నాడు రాజగురువు. 
"అత్యంత జుగుప్సా కరంగా ఉన్నది. నాకున్న ఈ చిన్ని బొర్ర బొజ్జే ముద్దుగా ఉన్నది" అన్నాను.     
"సరే మీ అభీష్టము. ఈరోజు ద్వంద్వ యుద్ధ శిక్షణ. కాబట్టి మీరు నాతో యుద్ధము చేయవలెను. ఆ విల్లు అందుకొనుడు" అన్నాడు. 
"ఈ సమయంలో యుద్ధ శిక్షణ కంటే పలహార భక్షణ సుఖప్రదంగా ఉంటుందేమో. పైగా నాకు ఈ ద్వంద్వ యుద్ధాలు అవి నాకు కొత్త. కావాలంటే ద్వంద్వార్ధపు బూతులు రెండు వచ్చు.. చెప్పమందురా" అన్నాను చాలా కంగారు పడుతూ.      
"ఇన్నేళ్ళొచ్చినా మీకు అల్లరితనం తగ్గలేదు. అంత భయము కూడదు. క్షత్రియుల వొళ్ళు ఇనుప గుళ్ళని నానుడి".
"ఏంటో ఈ కామెడీ ... తప్పదా" అని గొణికాను.  
"ఇక ఆటలు చాలించి నాతో యుద్ధానికి సిద్ధపడుడు ప్రభూ" అన్నాడు రాజగురువు.    
ఇంక తప్పక విల్లు తీసుకొన్నాను. బాణం సంధిస్తుండగా, రాజగురువు, "మహారాజా, గురువు తో యుద్ధం చేసేటప్పుడు కాళ్ళముందు నమస్కార బాణాలు వెయ్యాలి" అని తన కాళ్ళ వైపు చూపించాడు.
"తెలుసులే, నర్తనశాల సినిమాలో చూసాను" అని గొణికి, రెండు బాణాలు ఒకేసారి సంధించి ఆకర్ణాంతము లాగి వదిలాను. అవి రయ్యని దూసుకెళ్ళి రాజగురువు పాదాలను చీల్చుకొని భూమిలో నాటుకుపోయాయి.             
"చచ్చాన్రో !!!!!!!!!!!"  అని ఒక్క గావుకేక పెట్టి, నిల్చున్న చోటనే నిర్ఘాంత పోయి గిల గిలా కొట్టుకొంటున్నాడు రాజగురువు. 
నేను కంగారుగా విల్లంబులు వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాణాలు లాగి అవతల పారేసాను. కాసేపటికి తేరుకొన్న రాజ గురువు బాధతో మూలుగుతూ, "మహారాజా, నమస్కార బాణములు ఆకర్ణాంతమూ లాగ రాదు అని నిన్న చెప్పితిని కదా. కేవలము నాసికాగ్రము వరకే లాగాలి. ఇంకా నయం కుశల ప్రశ్నల బాణాలు వెయ్యమన్నాను కాదు. చెవులు ఛిద్రం అయ్యిపోయేవి. ఇక రేపు కలుద్దాం. సెలవు" అని కుంటుకొంటూ వెళ్ళిపోయాడు.          
మిగిలిన శిక్షకుల కేసి తిరిగి "ఆ(... తరవాతి విద్య మొదలు పెడదామా?" అన్నాను. అప్పటికే భయభ్రాంతులైన వాళ్ళందరూ పరుగు లంకించుకొన్నారు.  

చేసేది లేక మంత్రివైపు తిరిగి", "మన తరువాతి కార్యక్రమము ఏమిటి?" అన్నాను.  
"సభకి వేళ ఔతోంది ప్రభూ" అన్నాడు మంత్రి.

సరే అని నేను స్నానపానాదులు కావించి, మంత్రి తో సహా రాజసభ కి బయలు దేరాను. రాజ మందిరం లోకి అడుగు పెట్టగానే వంది మాగధులు, "ముచికుంద మహారాజులకీ జై !!!!!  ముచికుంద మహారాజులకీ జై!!!!" అని గొంతుచించుకొని అరిచారు.
నాకు మoటెక్కి పోయింది. "ఆపండి!!!! ఈరోజునుంచి నాపేరు మార్చుకొంటునాను. ఇక నుంచి నన్ను అందరూ హృతిక్‌రోషన మహారాజు అని పిలవాలి అర్ధం అయ్యిందా?" అన్నాను. 
అందరూ వింతగా చూసారు. ఆ వంది, మాగధి తల ఊపి, " కొంచెం కష్టముగా ఉన్నది కాని ప్రయత్నించెదము. ఇప్పుడు చూడండి, "ఉతికారేసిన మహారాజుకీ జై", "ఉతికారేసిన మహారాజుకీ జై" అని అరిచారు.   
"ఛీ !!! నావల్లకాదు" అనుకొని నా సింహాసనం మీద కూర్చొన్నాను.

ఈలోపు ఒక బంటు వచ్చి, "జయము జయము మహారాజ !!! ఎవరో నరసకవిగారట మన ఆస్థానం లో పండితులతో పోటీకి మీ అనుమతి కోరుతున్నారు ప్రభూ" అన్నాడు.
"సరే " అని భటుడిని పంపి, "మంత్రి గారు, మన అష్ట దిగ్గజాలను ప్రవేశ పెట్టండి" అన్నాను. 
మంత్రి ఆశ్చర్యపోయి, "ప్రభూ వారు రాయలు కొలువులో ఉంటారు. మన దగ్గర రెండు గున్న గజాలు తప్ప దిగ్గజాలు ఏమీ లేవు"
"పొనీ మన ఆస్థాన కవి ఎవరుంటే వాళ్ళని పిలవండి"
"ఏమిచెప్పమంటారు ప్రభూ. ఇటీవలే అతను రాసిన "అశుద్ధభక్షక చరిత్ర" అనే కావ్యాని అతని భార్యకి చూపించాడట. మొదటి పద్యం వినగానే ఆమె భళ్ళుమని కక్కుకొని, నాలుక కరుచుకొని స్పృహతప్పి పడిపోయిందట. . . ఈరోజు సెలవు లో ఉన్నాడు ప్రభూ.  ఇంక ఈ నరసకవి పని మీరే పట్టాలి" అన్నాడు.  
నేను మనసులో "చచ్చాం రా దేవుడా. ఈ నరసకవి అంటే ఆ తెనాలి రామక్రిష్ణ సినిమాలో ఉన్న క్యారక్టరు కాబోలు. ఇప్పుడు ఏంచెయ్యాల్రాబాబూ. ఆ మేక తోక పద్యం కూడా పూర్తి గా గుర్తు లేదు", అని తలగోక్కుని ఆలోచించగా ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
ఈలోపు నరస కవి వచ్చి, "జయము జయము మహారాజా !! నేను రాసిన పద్యానికి అర్ధం చెప్పగలిగిన వారు ఎవరూ కనపడలేదు. మీ రాజ్యం వారి పాండిత్యాన్ని పరీక్షిద్దామని నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది" అన్నాడు.  
"ఊరును, ఊరును!!! ఐనా అంత మీకే అర్ధం కాకుండా పద్యం ఎలా రాసారు"  
"అయ్యో!! అర్ధం నాకు తెలుసు మహాప్రభూ. పద్యం వినిపించమంటారా" అన్నాడు కవి.
"అవసరం లేదు. మీరు చెప్పబోయేది నాకు ఎప్పుడో తెలుసు. అదేదో "బావా బావా పన్నీరో బావని పట్టుకు తన్నీరో" ఏదో ఉంటుంది అదేనా?" అన్నాను
"అహ .. కాదు మహారాజ...అది భావ భవ భోగ సత్కళా ..." అని ఇంకా చెప్పబోయాడు.
"ఆ .. ఆ .. అదే అదే .... మీ పద్యానికి అర్ధం చెప్పటం నాకు జూజూబి. కాని ముందు నేను పాడే పద్యానికి మీరు అర్ధం చెప్పాలి" అన్నాను.
"సరే" అన్నాడు కవి.

"నాకు నీకు నోకియా,
ఇక రేపో మాపో మాఫియా...
క్యాపచ్చీనో కాఫియా .. సోఫియా"

"దీని అర్ధం చెప్పండి ముందు" అన్నాను.   

హతాసుడయ్యాడు నరసకవి, బిక్కమొహం వేసుకొని, అర్ధం చెప్పలేక, " ప్రభూ ఇంత దౌర్భాగ్యపు సాహిత్యం నా జీవితంలో వినలేదు కనలేదు. అసలు మీరు జూజూబి అన్నప్పుడే ఇదేదో అరవం వాడి అడవి జాతి భాష అని అనుమానం వచ్చింది. ప్రతి పదానికీ చివర్లో అయ్యా అయ్యా అంటున్నారంటే ఇదేదో అడుక్కుతినేవాడి పాటలా ఉంది.. అర్ధం చెప్పడం నావల్లకాదు. మీదే జయము" అని వెళ్ళిపోయాడు. 

"ఆహా మీరు వాని పీచమణిచారు మహారాజా. ఎక్కడ పట్టారు ఈ పద్యాన్ని" అన్నాడు మంత్రి.
"మరి తమిళ డబ్బింగు పాటలా మజాకా. అపరిచితుడు అని ఒక అర్ధం పర్ధం లేని సినిమా ఉందిలే. ఇంకా అసలు నేను కొత్త తెలుగు సినిమా పాటల పాడితే గుక్క పెట్టి ఏడ్చేవాడే" అన్నాను మీసం మెలివేస్తూ.  
"ఏంటో మహారాజా ఒక్కోసారి మీరు మాట్లాదేది నాకు అర్ధం కాదు"  అని వాపోయాడు మంత్రి.
"మన తరువాతి కార్యక్రమం ఏంటి?"
"ఈరోజు ప్రభువుల వారు వేటకి వెళ్ళాలి " అన్నాడు మంత్రి.
"వెళ్ళి ఏడు చేపలను తీసుకురావలెనా?"
"కాదు ప్రభూ!!! క్రూర మృగాలని వేటాడాలి. వేట... రాజధర్మం"
అబ్బా..మహారాజు యోగం అంటే ఏంటో అనుకొన్నాను. ఇన్ని కాంప్లికేషన్లు ఉంటాయని తెలీదు. చేసేదిలేక "ఐన రధము సిద్ధం చేయుడు. మీరునూ మాతో రండి" అన్నాను.
"చిత్తం ప్రభూ!!"

బయట రధం సిద్ధం చేయబడింది. నేను మంత్రి ఎక్కి కూర్చొగానే రధం బయలుదేరింది. కాసేపటికి మంత్రి, "మహారాజా!! మనము అడవిలోకి వచ్చేసాము. ఇంక విల్లంబులు సిద్ధం చేసుకోండి ప్రభూ" అన్నాడు. నేను విల్లు బాణాలు తీసుకొని అమర్చుకొంటూ ఉండగా, కాస్త దూరంలో ఎవరో అమ్మాయిలు కిల కిలమని నవ్వుతునట్లు వినిపించాయి.ఆశ్చర్యపోయి నేను, మంత్రి అటు వెళ్ళి చెట్టుపక్కనుంచి చూసాము.  

ఒక రాకుమార్తె అమె చెలులతో ఉయ్యాలలూగుతోంది. కాస్త దూరంలో ఒక ముసలి రాజు ఉన్నాడు.
పక్కనున్న మంత్రి, "దేవరా! ఈ కన్యలందరూ అతిలోకసుందరులు" అన్నాడు. 
"మరీ అంత అందంగా ఏమీ లేరే. పైగా కాస్త నల్లగా కూడా ఉన్నారు. అరవం వాళ్ళయ్యి ఉంటారు" అన్నాను. 
"అహ!! నేననంది వీళ్ళు పాతాళ లోకాని పక్కనున్న "అతి" లోకానికి చెందినవారు. కాస్త అతి ఎక్కువ చేయుదురు. ఆ ఉన్నవాళ్ళలో కాస్త తక్కువ నల్లగా ఉన్న అమ్మాయి ఆలోకపు రాజు గండభేరుండుని కూతురు, వీరగంధి. అదిగో ఆ చెట్టుకింద భటులతో కూర్చున్నవాడే గండభేరుండుడు", అన్నాడు.   

ఇంతలో చెట్లపొదల అవతల భయంకరమైన సింహ గర్జన వినిపించింది. హడలి చచ్చాను. ఒక పెద్ద సింహం బయటకి దూకి, వీరగంధి ఆడుకొంటున్న చోటుకి దూకి ఆమెను తరుమ సాగింది.  
"ప్రభూ, నా కరచరణములు కంపించుచున్నవి. మనము పలాయనము చిత్తగించెదమా?" అన్నాడు మంత్రి గడ గడ వణుకుతూ. 
"మంత్రీ!! మొదట నాకు కూడ దిమ్మ తిరిగినది. కానీ ఎందుకో ప్రాణాలకు తెగించి ఐనా సరే ఆ అమ్మాయిని కాపాడాలని అనిపిస్తోంది" అన్నాను వెంట తెచ్చుకొన్న విల్లుని ఎత్తి పట్టుకొని.
"చిత్తం ప్రభూ !! మావూరిలో దీన్నే స్త్రీ దౌర్బల్యం అంటారు. మీరు విజృంభించుడు" అన్నాడు.
ముందు ఆ సింహాన్ని దారి మళ్ళించాలని నేను "అహోయ్" అని గట్టిగా అరిచాను.
"ఎలా ఉంది మంత్రీ మన సింహనాదం"
"ఆర్తనాదం లా ఉంది ప్రభూ. అదిగో ఆ సింహం ఆమెను వదిలి మీ వైపు వస్తోంది. వెంటనే బాణ ప్రయోగం చెయ్యండి" అన్నాడు.
నేను బాణాన్ని తీసి లాగి, గురి పెడుతున్నాను.
"ప్రభూ ఆగిపోయారే. విసర్జించండి" అన్నాడు మంత్రి.
"అది మొదట్లో సింహ గర్జన విన్నప్పుడే చేసాము కదా. నీ పంచె కూడా బానే తడిసినట్లుంది"
"అబ్బా!! నేనన్నది బాణాన్ని"  అన్నడు మంత్రి.
"ఏంటో నాకు ఒక్క అస్త్రమూ జ్ఞాపకం రావట్లేదు. నీకేమైనా తెలుసా. అదేదో మంటలు, మతాబులు వచ్చే అస్త్రం ఉంటుందికదా" అన్నాను విపరీతమైన కంగారు గా.
"మీ ఇల్లు బంగారం కాను!!! ఈ బోడి సింహమును చంపుటకు అస్త్రములు అవసరం లేదు. ఆ బాణాన్ని వదలవయ్యా మగడా"     
ఈలోపు ఆ సింహం దగ్గరగా వచ్చేసి నామీదకి ఉరికింది. సరిగ్గా అదే సమయానికి చేతిలో చమటకి బాణం జారి, సర్రుమని వెళ్ళి, సింహం పొట్టను చీల్చేసింది. ఆ సింహం సరిగ్గా నాకు అంగుళం దూరంలో పడి చచ్చిపోయింది. భయంతో బిక్కచచ్చిపోయి స్థాణువై నిల్చొండిపోయాను.  కాసేపు కళ్ళు బయర్లు కమ్మేసాయి.   

ఈలోపు, "భళా!!! మహారాజ.....దానిని మట్టికరిపించారు" అని ఎగురుతున్నాడు మంత్రి. 
వీడి తలపాగా తగలడిపోనూ. కొంచెం ఉంటే నేను కీర్తిశేషుడనయ్యేవాడిని.  
ఈలోపు వీరగంధి వచ్చి, "రాకుమారా, సింగమును గాంచి నిరుత్తరనైన నాకు నిరుపమాన వీరత్వముతో స్వైరవిహారంచేసి, ప్రాణభిక్షపెట్టి,  నా మనోఫలకంలో మీ ముఖచంద్రిక ముద్రవేసారు. " అని చెయ్యి లాగడం మొదలు పెట్టింది.  
"నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు. తెలుగు టు అరవం నిఘంటువు చూడాల్సిందే. మా మంత్రి చెప్పినట్లు కాస్త అతి పాలు ఎక్కువే ఉంది నీకు" అన్నాను. 
ఇంతలో భేరుండుడువచ్చి, "ఆర్యా!! కంగారు వలదు. మా కన్యకామణి మీ పాణిగ్రహణమును కాంక్షించుచున్నది. " అన్నాడు.  
" ఇంకా నయం, ఈ మాట మా ఆవిడ విన్నచో నాకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రాప్తించును. వద్దులెండి" అన్నాను       
ఇంతలో మంత్రి, "ప్రభూ ... క్షత్రియులలో బహు వివాహము సమ్మతమే. ఈసారికి ఒప్పుకోండి. మనకి యుద్ధముల సమయంలో అతిలోకం వారి సహాయము ఉంటుంది" అన్నాడు మంత్రి. 
"నహీ!!!! రామునికి సీత ఒక్కత్తే. నాకు మా అవిడ ఒక్కత్తే .. మై ఏక్‌పత్నీ వ్రత్ హూన్" అన్నాను గంభీరంగా. అనగానే ఆకాశం నుండి దేవతలు పూల వర్షం కురిపించారు. కాసేపటికి నీళ్ళు కూడా గుమ్మరించారు. నా వొళ్ళంతా తడిసిపోయింది.      
"ఆపండెహె బట్టలు తడిసిపోతున్నాయి" అన్నాను కోపంగా. 

*      *      * 

"నీళ్ళు పోస్తే తడవవా?" అని కోపంగా వినిపించింది మా ఆవిడ గొంతు.
ఉలిక్కిపడ్డాను. కాసేపు అర్ధం కాలేదు. మెల్లగా ఈలోకంలోకి వచ్చాను.ఇంట్లో నా మంచం మీద పూర్తిగా తడిసి పోయి ఉన్నాను.
"ఎవరా వీరగంధి. తెగ కలవరిస్తున్నరు?" అంది మా ఆవిడ డేంజరస్ గా.... 
"అబ్బే అదేమి లేదు బంగారు. ఏదో కల. కలలో నువ్వు నాకు వీర గంధం రాస్తున్నావు  ... అంతే .. అంతే .. ఇంతకీ ఈరోజు మనం షాపింగు కి వెళ్ళాలి కదూ" అన్నాను కంగారు గా.
మా ఆవిడ శాంతించింది. "ఔనండోయ్. మొన్న ఒక ఎల్లో డ్రస్సూ............................................."    
నా మనసులో, "ఉఫ్ ఫ్ ఫ్ .. మళ్ళీ మొదలు ... "   

*      సమాప్తం      * 




Thursday, December 2, 2010

రాగం లో అనురాగం లో విరాగం

ఓసారి నా బి ఆర్క్ రెండో సంవత్సరం సెమిస్టర్ ఎగ్జాంస్ లో సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష అంత బాగా రాయలేదు. నేను ఆ పరీక్ష పాసయ్యి గట్టెక్కితే, లేదా నాతో పాటూ మిగిలిన వాళ్ళు కూడా ఫెయిల్ ఐతే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకొంటానని వెంకన్న కి మొక్కుకున్నాను. రిజల్ట్స్ వచ్చాయి. చాలా విచిత్రం గా నేను పాసయ్యాను. చాలా మంది ఫెయిల్ అయ్యారు.

Two birds at one shot రావడం తో ఆ ఆనందం తట్టుకోలేక ఆరోజు రాత్రే అందిన బస్సు పట్టుకుని తిరుపతి బయలుదేరాను. బస్సు స్టార్ట్ అయ్యిన ఒక 15 నిమిషాలకి క్లీనరు వచ్చి ఎదో సినిమా పెట్టాడు. పోనీలే బోరు కొట్టకుండా సినిమాతో టైం పాస్ ఔతుంది అని అనుకునే లోపు టీవీ స్క్రీను మీద సాయి కుమార్ నటించిన "పోలీస్ స్టోరీ" టైటిల్ పడింది. ఎటూ పారిపోలేని పరిస్థితులు కల్పించి ఆ సినిమా పెట్టిన క్లీనర్ గాడ్ని .. #$%^&*())(*&^%$#@!@# ...అని తిట్టుకుని, తెచ్చుకున్న దుప్పటీ మొహం మీద కప్పుకుని, చెవుల్లో దూది ముక్కలు కుక్కుకుని పడుకున్నాను. నిద్ర మధ్యలో అప్పుడప్పుడూ, "నీ యబ్బ !!!!!!!!! నరికేస్తా నా ...... లబ్బే నా........ బేవార్స్ నా...... ........" లాంటి ఆణి ముత్యాలవంటి అరుపులు వినిపించినా, నిద్రా దేవి సంపూర్ణ కరుణా కటాక్షాలు ప్రసరించి నిద్రాభంగం కాకుండా తెల్లారే సరికి తిరుమల చేరుకున్నాను.

ముందు గుండు చేయించుకుని స్నానం ముగించి, దర్శనానికి క్యూ లో జాయిన్ అయ్యి నించున్నాను. దూరం నుంచి ఘంటసాల గారి భగవద్గీత వినిపిస్తోంది. "అర్జునా మనుష్యుడు ఎటుల మాసిన వస్త్రమును వదిలి కొత్త వస్త్రము ధరించునో ఆత్మ అట్లే జీర్ణమైన శరీరం వదిలి కొత్త శరీరం ధరించుచున్నది."
నేను, "ఈ వెధవ శరీరం కోసమా కదా మనం ఇన్ని పాట్లు పడేది ఇది కేవలం మాసిన బట్ట మాత్రమే. ఇక నుంచి మోహాన్ని వదిలి మోక్షాన్ని ఆశ్రయించాలి." అని మనసులో అనుకున్నాను.

ఈలోపు అక్కడ ఉన్న మహా భక్త సందోహం లో ఓ నలుగురు టైం వేస్ట్ చెయ్యకుండా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యవసర సమస్యల మీద పిచ్చాపాటీ మొదలు పెట్టారు. వీళ్ళ గురించి ఈ కధ లో చాలా సార్లు ప్రస్తావించబడుతుంది కాబట్టి, వీళ్ళ పేర్లు నాకు తెలీదు కాబట్టి, మనకి తెలియని వాళ్ళని సుబ్బ్రావనో, వెంకట్రావనో పిలవడం పరిపాటి కాబట్టి వాళ్ళకి వెంకట్రావ్ గ్రూప్ అని పేరు పెట్టాను.

వాళ్ళలో ఓ వెంకట్రావ్ , "ఏంటో సార్ ఈ వెయిటింగు, మా బావమరిది కనుక ఊళ్ళో ఉండి ఉంటే ఈ పాటికి దర్శనం అయ్యి పోయి ప్రసాదం కూడ తింటూ ఉండే వాళ్ళము." అన్నాడు.
ఇంకో వెంకట్రావ్, "ప్రసాదం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ లడ్డూ లో జీడిపప్పు కలుపుతున్నారో లేదో? అసలు లడ్డూ లో జీడిపప్పు కలపక పోవటం ఏంటి సార్ దారుణం. తిరుపతి లడ్డూ ఫేమస్ అయ్యిందే దానివల్ల." అన్నాడు.
మూడో వెంకట్రావ్, "అంతా రాజకీయం సార్, రాజకీయం. ఈ దేశం మారదు. ఈ రాజకీయనాయకులందరినీ వరుసలో నించో పెట్టి షూట్ చేస్తే తప్ప ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు." అన్నాడు.
చివరి వెంకట్రావ్, " ఇంతకీ తెలంగాణా వస్తుందంటారా రాదంటారా. వస్తే ల్యాండ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా?" అన్నాడు.
మొదటి వెంకట్రావ్ నాకేసి తిరిగి, "మీరు ఏమంటారు వెంకట్రావుగారు." అన్నాడు.
నేను, "దేనిగురించి? లడ్డూ గురించా? తెలంగాణా గురించా?".
వాడు, "లడ్డూ గురించి సార్."
నేను, "నేను స్వీట్లు తినను." అని చెప్పి మళ్ళీ కదిలిస్తాడేమో అని ఇంకో పక్కకి చూసాను.

అంతే !!!!, ఎవరో మంత్రం వేసినట్లు నా కళ్ళు అటే చూస్తూ ఉండి పోయాయి.
ఒక అమ్మాయి .... స్వర్గంలో అప్సరసలు నాట్యం చేస్తుంటే, వాళ్ళలో ఒకరు ఆ డాన్స్ చేస్తూ చేస్తూ పొరపాటున కాలు స్లిప్ అయ్యి మెట్లమించి జారిపోయి, నాకోసం భూలోకం వచ్చి నా పక్కన నిలుచుందా!!!! అన్న ఫీలింగ్.

ఇహ మనిషి, మాసిన వస్త్రం, ఆత్మ ఇవి ఏమీ గుర్తు రావట్లేదు. మనసు నిండా ఆ అమ్మాయే. హు....... మా క్లాసులోనూ ఉన్నారు అమ్మాయిలు ఎందుకు. ఈ అమ్మాయిని చూడు చెంపకి చారెడు కళ్ళేసుకుని ఎంత అందం గా ఉంది. నాకు తగిన అమ్మాయి గుళ్ళో నే ఎదురౌతుందని ఓసారి చిలక జోస్యం వాడు కూడా చెప్పాడు.

ఇంతలో............
తిరుపతి లో స్వామి దర్శనానికి వచ్చి ఇలా అమ్మాయికి లైను వేయటం తప్పేమో అనిపించింది. ఇది ఒక ధర్మ సంకట స్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో నా బుద్ధి, నా మనసు రెండూ సూక్ష్మ దేహాలు ధరించి నా చెవుల పక్కకి చేరి తర్క జ్ఞాన బోధ చేస్తాయి.
బుద్ధి, " ఔను తప్పే రా.." అంది.
మనసు, "భగవంతుడే నీకోసం పంపినపుడు తిరస్కరిస్తే ఆయనకి కోపం వస్తుందని" బుద్ధి కి సర్ది చెప్పింది.
"అంటే భగవంతుడు ఇలాంటివి వరాలు కూడ గ్రాంట్ చేస్తాడా?" అని బుద్ధి మనసుని ప్రశ్నించింది.
"నువ్వు మూసుకుని లైను వెయ్యి బే, లేకపోతే ఇంకోడు రెడీ గా నీ వెనకాలే ఉన్నాడు" అని బుద్ధి మీద మనసు జయించింది.
సరిగ్గా అదే సమయం లో ఘంటసాల గారు, "కర్మణ్యేవాధికారస్తే ............." శ్లోకం పాడారు.

పని చెయ్యటమే మనవంతు. ఫలితం దేవుడికివదిలేద్దాం అని ఘంటసాల గారికి ఒక థ్యాంక్స్ చెప్పి ఆ అమ్మాయికి లైను వేసే పని లో నిమగ్నమయ్యాను. ఆ అమ్మాయి కూడా నన్ను చూస్తూ సిగ్గు పడటం మొదలు పెట్టింది.

ఈలోపు ఇటు పక్కన చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వాళ్ళలో ఓ వెంకట్రావ్, నాకేసి తిరిగి "మీరు ఏమంటారు సార్" అన్నాడు.
లైను వేసే పని లో అంతవరకూ వాళ్ళ మాటలు వినని నేను అర్ధం కాక, "దేనిగురించి?" అన్నాను.
అతను, "అదే సార్ ముమ్మైత్ ఖాన్ కి పెళ్ళి అయ్యిందా లేదా అని మాట్లాడు కుంటున్నాం కదా దాని గురించి" అన్నాడు. అసలు వీళ్ళు తిరుపతి లడ్డూ నుంచి ముమ్మైత్ ఖాన్ దగ్గరకి ఎలా వెళ్ళారో అర్ధం కాక ఏదో ఒకటి చెప్పాలని, "లేదు" అన్నాను.
దానికి అతను మిగతా వాళ్ళతో, "చెప్పానా, చెప్పానా" అని గంతులు వేసాడు. నేను వాళ్ళ సంగతి వదిలి మళ్ళీ నా పని లో నిమగ్నమయ్యాను.

ఆ అమ్మాయిని చూస్తూ నడుస్తున్నాను. జీవితం లో ప్రతీ క్షణం ఇలా ఆ అమ్మాయిని చూస్తూ ఉండి పోవాలనిపించింది. తను కూడా నాకేసి చూసి కాస్త నవ్వే టైం కి, పక్కనున్న వెంకట్రావ్, ఆ అమ్మాయికి నాకు మధ్యలోకి వచ్చి నా మొహం లో మొహం పెట్టి "మీరేవంటారు?" అన్నాడు.

శుద్ధ హిందోళం లో రిషభం లా ఎవడ్రా వీడు అనుకుని "అయ్యా వృషభ వెంకట్రావ్ గారు, మీరు నన్ను వదిలేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను" అన్నాను. దానికి అతను బాగా హర్ట్ అయ్యి మళ్ళీ చర్చలో మునిగిపోయాడు.

ఈ లోపు ఆ అమ్మాయి జడలోంచి ఒక గులాబీ పువ్వు జారి కింద పడింది. నా పక్కనున్న వెంకట్రావ్ చూసుకోకుండా ఆ పువ్వుని తొక్కెయ్యబోతుంతే నా అరచెయ్యి ఆ పువ్వు మీద బోర్లించి పెట్టాను. యే జాలీ లేకుండా ఆ వృషభ వెంకట్రావ్ నా చెయ్యి ని గంగిరెద్దు గొబ్బెమని తొక్కినట్లు తొక్కేసాడు. నెప్పి తో మనసులో వెర్రి కేకలు వేస్తున్నా చిరునవ్వు చెక్కు చెదరకుండా ఆ పువ్వు ఆ అమ్మాయి కి ఇచ్చాను. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. నా మనసు "జనక,... జజ్జనక ..." అంటూ పులి డాన్స్ మొదలు పెట్టింది.

ఇంక గర్భ గుడి దగ్గరకి రాగానే, "ఇప్పటికైనా నన్ను చూడరా" అని స్వామి పిలిచినట్లనిపించి, అటు తిరిగాను. తిరగగానే గర్భ గుడి గుమ్మానికి నా గుండు టంగుమని కొట్టుకుంది. వెనకనుంచి ఒక వెంకట్రావ్ దబ్భేల్ అని తోసాడు. నా గుండు మళ్ళీ వెళ్ళి గుమ్మానికి కొట్టుకుంది. గడపకి కాలు తన్నుకుని బొక్క బోర్లా పడిపోయాను. నా వెనకాల వస్తున్న నలుగురు వెంకట్రావులూ నన్ను తొక్కేసుకుంటూ "గోవిందా .......గో......విందా" అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఫక్కున నవ్వింది.

ఇదంతా కొన్ని సెకన్లలో జరిగిపోయినిది. ఇంతలో ఎవరో ఓ పెద్దాయన నన్ను లేపి. స్వామి దగ్గరకి నడిపించుకుని వెళ్ళాడు. ఆ దెబ్బలని ఒత్తుకుంటూ, స్వామి కి చెమర్చిన కళ్ళతో నమస్కరించాను. స్వామి కూడా నాకేసి దీనం గా చూస్తూ ఉన్నట్లనిపించింది. ఇంకాస్త ఏడుపొచ్చింది.

అడుగు లో అడుగు వేసుకుంటూ బయటకి వెళ్ళి ఆ పులిహొర ప్రసాదం తీసుకుని ఓ అరుగు మీద కూర్చున్నాను. ఆ అమ్మాయి, మళ్ళీ కనిపించలేదు. దూరం గా ఘంటసాల గారు, "విషయవాంచల గూర్చి సదా ఆలోచించు వానికి దానియందు అనురాగం అధికమై అది కామముగా మారి, అది దక్కని చో క్రోధమై, వివేకము పోయి బుద్ధిచలించి, గుండు మీద దెబ్బ తగులును" అన్నారు. ఉక్రోషం వచ్చింది. ఔను నిజమే లేకపోతే ఇందాకటి వరకూ నన్ను చూసి సిగ్గుపడిన అమ్మాయి, నన్ను తోసేసి కింద పడేసి తొక్కేస్తే అలా నవ్వుతుందా?? అని మనసు ఆక్రందించింది.

గుండు మీద గాటు, గుండెల్లో గాయం అవ్వటంతో, "ఛ, ఛ, ..... ఇంక జీవితం లో యే అమ్మాయికీ లైను వెయ్యకూడదు. ప్రమాదం ఎప్పుడూ మన నీడలా మనవెంటే ఉండి, గుళ్ళో వెనకనుంచి తోసేస్తుంది. ఐనా ఈ అమ్మాయి యేమీ అంత బాలేదు. మా క్లాసు అమ్మాయిలే నయం. కనీసం అప్పుడప్పుడూ బాగుంటారు" అనుకుని, మనసుకి మందు పూసుకుంటూ ఆరోజు తిరపతి లో గడిపి సాయంత్రానికి బస్సు ఎక్కాను.

నా సీట్లో కూర్చున్న కాసేపటికి ఒక అమ్మాయి వచ్చి నాకు అటు పక్కన సీట్లో కూర్చుంది. అప్పటికే ఒక దురదృష్ట సంఘటన అయ్యేసరికి ఈ అమ్మాయిని చూడకూడదని నిర్ణయించుకున్నాను.
కాసేపాగాకా మనసు దెబ్బలనుంచి తేరుకుంది. "ఇందాకా అంటే ఎవడో తోసేసాడు కాబట్టి అలా అవమానం పాలు అయ్యాం కానీ, అస్తమాను అలా ఔతామా ఏంటి??" అని అడిగింది.
బుద్ధి, "ఒరేయ్ !!! మళ్ళీ దెబ్బ తింటావ్ రో" అంది.
మనసు, "యూత్ లో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ మావా?" అంది.
బుద్ధి, "నీకు ఈ జన్మకి బుద్ధి రాదు రా........ ఛీ ...ఛీ... ఛీ.." అంది.
మనసు బుద్ధి ని, "వ్వె, వ్వె, వ్వె ....." అని వెక్కిరించి లైను వెయ్యటానికి సమాయుత్తమయ్యింది.

మనసు నీతి లేని కోతి లాంటిది అని జంధ్యాల గారు ఉత్తినే అన్నారా.

Tuesday, September 21, 2010

జాబు - జవాబు - జీతం

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఈ సామెత జాబ్ ఇంటర్వ్యూస్ కి ఖచ్చితం గా సరిపోతుంది.

నా జీవితం లో మొట్ట మొదట ఇంటర్వ్యూకి హాజరు అయ్యినది, నా 18 ఏళ్ళ వయస్సులో నేషనల్ డిఫెన్స్ సెలక్షన్స్ కి వెళ్ళినప్పుడు. అస్సలు అనుభవం లేని నేను, ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి నా ఆహార్యం తోనే మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలని అన్నీ హంగులు చేసి, కాస్త దైవ భక్తి ఉన్నట్లు కనపడితే ఇంకొంచెం ఎక్కువ మార్కులు నొక్కెయ్యొచ్చని, మా ఊరి గుళ్ళో రామప్ప ప్పంతులుగారు పెట్టుకున్నట్లు పొడుగు బొట్టు పెట్టుకుని ఠీవిగా ఆ హాలులో ప్రవేశించాను.

ఇంటర్వ్యూయర్ నన్ను చూడగానే, "నీ నుదిటి మీద రక్తం వస్తొంది.... ఏం జరిగింది?" అని అడిగారు. నేను నా భక్తిభాగోతం చెప్పగానే ఆయన, "భక్తి తో భారత దేశాన్ని కాపాడేద్దామని వచ్చావా నాయనా? సరే కూర్చో" అన్నారు. కాసిని వ్యక్తిగత ప్రశ్నలు అడిగిన తర్వాత, కొన్ని సిచుయేషనల్ ప్రశ్నలు అడిగారు.

ప్రశ్న: "నువ్వు అడివిలో వెళుతున్నావు. నీకు ఒక పులి ఎదురైంది. అది బాగా ఆకలి మీద ఉంది. నువ్వు నీరసం గా ఉన్నావు. అప్పుడు ఏమి చేస్తావు?"
నేను: "నాకు వచ్చే జన్మ లో ఐనా ఇలా ఇంటర్వ్యూలకి వెళ్ళే దౌర్భాగ్యం కలగకుండా బాగా ఆస్తిని ఇవ్వమని కడసారి గా దేవుణ్ణి ప్రార్ధిస్తాను."

ప్రశ్న: "మీఇంట్లొ నువ్వు ఏదైనా పనులు చేస్తూ ఉంటావా?"
నేను: "ఆయ్!!!!! మా అమ్మగారిని అసలు కాలు కింద పెట్టనివ్వనండి." 

దానికి ఆయన, "ఔనా!!!!!!!! మీఇంట్లో నీ బట్టలు ఎవరు ఉతుకుతారు నాయనా?" అన్నారు.
నేను: "మా అమ్మగారండి." అని నాలిక కరుచుకున్నాను. (దీన్నే contradicting your own statement అంటారని తరవాత తెలిసింది)
యేది యేమైనా నా నిజాయితీ, పాజిటివ్ ఆటిట్యూడ్, భవిష్యత్ ప్రణాళికలు చూసి నన్ను సెలక్ట్ చేస్తాడు అనుకున్నా, కానీ సెలక్ట్ కాలేదు.

(4 సంవత్సరాలు తర్వాత.........)
నా ఆర్కిటెక్చర్ పూర్తి అయ్యింది, ఒక కంపెనీ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పటికి కూడ నాకు ఇంటర్వ్యూ ని సమర్ధవంతం గా ఎదుర్కొనే యుక్తులు వంటబట్టలేదు. నా ఇంటర్వ్యూ మొదలయ్యింది.

ప్రశ్న: "నీ గురించి చెప్పుకో"
నేను: "ఎవరి పేరు చెపితే సీమ ప్రజలు ....."
నన్ను ఆపి, "చిరంజీవి గురించి కాదు. నీ గురించి చెప్పు" అన్నాడు.
నేను తెలుగు మహాభారతం లోని, "ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు, రాజభూషణ రజో రాజినడగు ..." అనే ధర్మరాజుని పొగిడే పద్యం స్టార్ట్ చేసాను.
ఆయన తల పట్టుకుని, "కొంచెం తెలుగు లో చెప్పు బాబు." అన్నారు.
"నేను ఒక ఆర్కిటెక్ట్ ని" అన్నాను.
ఆయన, "ఆర్కిటెక్ట్ అంటే?" అన్నాడు.

నేను వెంటనే, "ఆర్కిటెక్ట్ అంటే....ధాతా రాతిరాతిర్ధాతా, ధాత రాతి సవితా సవితా. రాతిర్ధాత ధాత రాతిర్ సవితా రాతిర్ సవితా సవితేదం ఇదం సవితా........" అన్నాను.

ఇంటర్వ్యూయర్ భరించలేక నా రెస్యూమె లోని మొదటి పేపర్ ని చింపేసి, చిరాగ్గా మొహం పెట్టి, "నీ బలాలుబలహీనతలు ఏంటి?" అని అడిగాడు.
ఎంతో కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ ఐతే అసలు కోర్స్ కి సంబంధించిన ప్రశ్నలుమానేసి దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతున్నాడని నాకు చిరాకొచ్చింది.
నేను: "బలం: హనుమాన్ చాలీసా; బలహీనతలు: ఇలియానా, జెనీలియా" అన్నాను.

నాకు ఆ ఉద్యోగం రాలేదు. ఈ సారి "How To crack interviews?" అనే కోచింగ్ చెంటర్ లో చేరాను. వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎక్కడికి వెళ్ళినా కోర్స్ కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే కాకుండా, కొన్ని రొటీన్, ప్రశ్నలు ఉంటాయి. "నీ గురించి చెప్పు", "నీ బలహీనతలు ఏంటి", "నీ బలాలు, బలగాలు ఏంటి" లాంటివి. అసలు కరచాలనం లోనే మన వ్యక్తిత్వం తెలిసే సైన్సు ఎదో ఒకటి ఉందని అప్పుడే తెలిసింది. కరచాలనం ఎంత బలంగా ఇస్తే మనకి అంత దమ్ము ఉన్నట్లు.

బాగా ట్రయిన్ అయ్యిన కొన్ని రోజులకి ఫ్రెష్ గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూయర్ కరచాలనం చెయ్యటానికిచెయ్యి ఇవ్వగానే గజేంద్ర మోక్షం లో ఏనుగు కాలుని మొసలి పట్టుకున్నట్లు పట్టుకుని, పిసికి పిప్పి చేసివదిలి పెట్టాను.

తర్వాత దాదాపు అన్ని ప్రశ్నలు బాగానే ఆన్సర్ చేసాను. చివరి లో చాలా ఇంటర్వ్యూలలో మనల్ని తికమక పెట్టే ప్రశ్నలు రెండు వేశాడు.

ప్రశ్న: నిన్నే ఎందుకు ఈ కంపనీ లో తీసుకోవాలి?
(నా అంతరంగం లో జవాబు: నాకు పని కావాలి, నీకు పనోడు కావాలి. నాకంటే తెలివైన వాడికి నువ్వు జీతం ఇవ్వలేవు, నాకంటే వెధవని పెట్టుకునే రిస్కు చెయ్యలేవు కనుక)
బయటకి మాత్రం, "నేను 64 కళలని పోషించిన ఘన చరిత్ర కలవాడను. సంస్కృత ఆంధ్రలలో ను, వ్యాకరణమీమాంసలలోను, చతుర సంభాషణలలోను, వేదాంత వ్యాఖ్యానాలలోను, జాగ్రఫీ, గీగ్రఫీ, అర్ధమెటిక్స్, పావుమెటిక్స్లాంటివి హడలేసి చెప్పుటలోను, నెపోలీయన్ ఆఫ్ యాంటీ నాచ్ అయిన గిరీశం వంటివాడిని ...." లాంటి నాలుగైదు డవిలాగులు వదలగానే ఇంటర్వ్యూయర్ గట్టిగా అవలించి, "నీ లాంటివాళ్ళు యెకరానికి యాభై మంది దొరుకుతారు. నీ గొప్ప యేంటి?" అన్నాడు. (ఇది ఒక టాక్టిక్ అని నాకు తర్వాత తెలిసింది. మనల్ని ఎంత కిందకి చేసి మనకి చూపిస్తే మనం అంత తక్కువకి జీతం నంబర్ పడేస్తాం)

నేను ఏమి చెప్పాలో తెలీక, "ఖాళీ సమయాల్లో మీకు కాళ్ళు పడతాను" అని చెప్పి నాలిక కరుచుకున్నాను.
వైద్యుడు ఇచ్చేది రోగి కోరేది ఒకటే అయ్యింది.

వెంటనే తరవాతి ప్రశ్న అడిగాడు జీతం ఎంత రావాలనుకుంటున్నావు. ఈ ప్రశ్న కి మాత్రం సంకోచించకుండా, తటపటాయించకుండా ఒక 20 టు 25 అని చెప్పాను. (నావుద్దేశ్యము 20,000 - 25,000 అని).

అంతే ఉద్యోగం వచ్చేసింది. తరవాతి రోజు ఆఫర్ లెటర్ ఇచ్చారు. జీతం 2225 రూప్యములు. నేను ఖంగు తిన్నాను. "డబ్బిచ్చువాడు వైద్యుడు" లాంటి అసంబద్ధ సామెతలు కనిపెట్టింది ఈ కంపెనీ లాంటివాడే అయ్యిఉంటాడు. ఎంతటి లత్తుకోరు కంపెనీ ఐనా ఈ 21 వ శతాబ్దం లో కనీసం 10,000 తో మొదలు పెడుతున్నారు. ఈ కసాయి వాడు నన్ను చాలా చీప్ గా కొనేసాడు.

అందుకే ఆ తర్వాత యే ఇంటర్వ్యూలకి వెళ్ళినా నా జీతాన్ని సుస్పష్టంగా చెప్తూ ఉంటాను.

Saturday, June 19, 2010

అరాళ కుంతలా

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా
చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద
అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.
"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.
ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి
"నీ పేరు" అన్నారు.
-చక్రపాణి-
"గోత్రం"
-అరాళ కుంతల-
పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.
"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా
ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

Thursday, January 14, 2010

చిన్న పద్యం

తారే జమీన్ పర్ చూసినప్పుడు కలం కదిలి ఇలా అయ్యింది

బుడిబుడి అడుగుల తడబడి
నిలబడి పరుగెడి బుడతడి
శిరమున వొరవని చదువులు జొరపగనేల
చిరుచిరు పసిపసి చిగురులు
విరిసిన బుజిబుజి మొక్కలు
కడివెడు ఎరువకు ఘడియకు పళ్ళీగలవా?

Wednesday, December 9, 2009

మబ్బు మెసేజ్

కాళి దాస విరచిత మేఘ సందేశం అపూర్వమైన ఒక మధుర కావ్యం. ఆ ఆవకాయని, క్షమించాలి, ఆ వాక్కాయని,, మళ్ళీ క్షమించాలి ఆ కావ్యాన్ని చదివే అవకాశం నాకు కాకతాళీయం గా కలిగింది. మా కూచిపూడి డాన్స్ గురువు గారైన డా|| యశోద గారు, ఉజ్జయిని కాస్మో పాలిటన్ సిటీ లో కాళిదాస అకాడమీ లో జరిగే కాళిదాస సమారోహం అనే ఒక ఆర్ట్ ఫెస్టివల్ కి ఈ కావ్యాన్ని (హమ్మయ్య పొల్లు పోలెదు) మా చేత నృత్య రూపకం గా చేయించారు. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శన చేయటం చాల అరుదు గా వచ్చే అవకాశం. ఆ ప్రదర్శన కి ముందు, ఆ రంగస్థలి మీద మరో NTR లా వెలిగి పోవాలని నేను పడ్డ తపన తడిసి మోపెడు అయ్యింది. ఎందుకంటే నా జీమాట్ పరీక్ష ప్రిపరేషను సన్నగిల్లి జూ|| NTR లా తయారయ్యింది. ఐనా సరే పట్టు వదలలేదు.
మా గురువు గారు యక్షిని పాత్ర వేసారు. నా చేత యక్షుడి పాత్ర వేయించారు. ఇంకో ఇద్దరు స్టూడెంట్లు మధ్యలో కధా విధానం కొనసాగించే వాళ్ళు గా వేసారు. ఆ కావ్యం లో శ్లోకాలు బట్టీ పట్టడం మొదలు పెట్టాను. దానికి ఒక కారణం ఉంది. ఈ శ్లోకాలకి సంగీతం కూర్పు చేసిన శ్రీ మురళి గారు వాటిని ఫాటకి ముందు సాకీలు ఉంటాయి చూసారు, అలాగ రూపొందించారు. తాళ బద్ధం గా ఉన్నా, గాయకుడు ఆ శ్లోకాలని బట్టీ పట్టాల్సి వచ్చింది. ఆ రూపకానికి మేము పెట్టుకున్న గాయకుడు ఆ శ్లోకాల బట్టీ పట్టలేక చీల్చి చండాడటం మొదలు పెట్టడు. అంటే శంకరాభరణం లో బ్రో ..చే ..వా ..రె.వ రురా ... ప ప ప పం ...టైప్ లో. ఆయన పాడే పార్ట్ కి డాన్స్ చెయ్యా ల్సింది నేనే కాబట్టి మా గురువు గారు ఒక పంచ దిన ప్రణాళికని వేసారు. ఆయనకి శ్లోకాలు బట్టీ వేయిస్తే రాగయుక్తం గా ఆయన పాడుకుంటాదని ముందు నాన్ను నేర్చుకోమని తర్వాత ఆ గాయకుడి కి నేర్చుకోవటం లో సహాయం చేయమన్నారు. ఏమి చెయ్యను? గురువు గారి ఆజ్ఞ, నా తక్షణ కర్తవ్యం. ఐనా అంబలి తాగే వాడికి మీసాలు ఒత్తే వాడు ఒకడు ఉండటమంటే ఇదే. ముందు నేను రాత్రనక పగలనక సాధన చేసి ఆ శ్లోకాలు నేర్చుకున్నాను. తర్వాత ఆ గాయకుడి ని పిలిచి ముందు ఒక చిన్న ఉపొద్ఘాతం చెప్పాను. "చూడండి' The relationship between a singer and dancer should be like fish and water but not like fish and fish curry'. ఎప్పుడో చిన్నప్పుడు పక్కింట్లో తిన్నాను తప్పులుంటే మన్నించు, అసలు నువ్వు fish curry యే తినక పోతే క్షమించు" అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోయాను. ఆన అంతలోనే కన్నీళ్ళ పర్యంతమై "అయ్యా శ్లోకాలు నేర్చుకొవాలి అంతే కదా" అన్నాడు. సరేలే పాయింట్ క్యాచ్ చేసాడని సంతోషించాను. కొంచెం అటూ ఇటు గా బానే పాడటం మొదలు పెట్టాడు.

ఆ శ్లోకాలల్లో వర్ణనలు అవి చాలా హృద్యం గా ఉంటాయి. చాలా మందికి ఆ మేఘ సందేశం కధ తేలిసే ఉంటుంది. కుబేరుడి శాపం వల్ల ఆయన కొలువులో ఉండే ఒక యక్షుడు తన భార్య అయిన ఒక యక్షిని కి దూరం ఔతాడు. ఆ సమయం లో సెల్ ఫోన్స్ లాంటివి లేవు కనక ఒక మేఘం తో కబురు పెట్టి క్షేమ సమాచారం తెలుసుకోవటం అవి చేస్తాడు. సెల్ ఫోన్స్ అవి లేని సమయం లోనే ఇంత టెక్నికల్ గా అడ్వాన్స్ చెందిన మనం ఈ రోజు యాపిల్, నోకియా, సోనీ అంటూ కుక్కల పేర్లు ఉన్న సెల్ ఫోన్స్ పొరుగు దేశాల నుంచి అడుక్కు తెచ్చుకునే ఖర్మ ఎంటో? అంటే మబ్బులతో వాటితో మేసేజ్ లు పంపిస్తే కమ్యునికేషన్ గ్యాప్ ఏమైనా వస్తుందేమో అన్న భయం ఉండి ఉండవచ్చు. మన వెర్రి కాని సెల్ ఫొన్స్ లో మాట్లడినా ఇలాంటి గ్యాప్స్ వస్తాయి. నిజం. మొన్న ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకడు వాడి కోర్స్ టీం మేట్ ఒక అమ్మయి కి ఫోన్ చేసి, "ఏంటి ఈ మధ్య ఫోన్ చేస్తుంటే కాల్ ఎత్తట్లేదు" అన్నాడు. దానికి ఆ అమ్మాయి "నువ్వు ఫొన్ చేస్తే నేను "కాలు" ఎత్తడమేంటి" అని కంఫ్యూజ్ అయ్యిందిట. ఇంతకీ మి చెప్తున్నా .... ఆ అదే మొత్తానికి అంతా ఆ ప్రదర్శన కి సిద్ధం అయ్యాం.

ఉజ్జయిని చేరుకున్నాకా మొదలైంది టెన్షన్. మా గంధర్వ గాయకుదు ఫైనల్ రిహార్సల్ లో హరిశ్చంద్రుడి నాటకం లో "ఇచ్చోటనే... లేత ఇల్లాలి...." లాంటి కాటికాపరి పద్యాల్లాగా పాడటం మొదలు పెట్టాడు. ఈ సారి మా గురువు గారు ఆయన్ని పిలిచి "Music is divine whether it is western or indian... " అని మొదలు పెట్టారు. ఆయన కంగారు పడి "అమ్మా!! ఎదో కొంచెం రాగం తప్పింది క్షమించండి, ప్రోగ్రాం లో బాగా పాడతానని" ఒట్టు పెట్టాడు. నాకు అనుమానమే, ఆయన స్టేజి మీద పొరపాటున ఆపినా నేను కంటిన్యూ చేయటం కోసం, నేను ఒక్క సీన్ కూడ మర్చిపోకుండా అన్నీ గుర్తు ఉండటం కోసం దేవుని కృప ఎంతైనా అవసరం అని ఆ రోజు త్రి కాల సంధ్యావందనం చేసాను. ఐనా నిజం చెప్పాలంటే, కాళికాదేవి కాళిదాసు గారికి నాలుక మీద బీజాక్షరాలు రాసినట్లు, చిన్నప్పుడు మా అమ్మ నాకు జ్ఞాపక శక్తి అమోఘం గా ఉండాలని సరస్వతీ పత్ర లేహ్యం, జ్ఞాన శూర మహా తాండవ పత్ర లేహ్యం, ఝండూ చ్యవన ప్రాస్, నా నాలుక మీద రాసి పన్లో పని అని ఆ పక్కనే ఉందని మా తాత గారు వాడే త్రిఫల చూర్ణం కూడా రాసింది. జ్ఞాపక శక్తి మాట ఎలా ఉన్నా ఆ త్రిఫల చూర్ణం దెబ్బకి ఒక మూడు రోజులు నేను బాత్రూము కి బెడ్ రూం కి మధ్య పెట్టిన మొత్తం పరుగులు ముందు టెండూల్కర్ రికార్డ్ బలాదూర్. ఆ తర్వాత బ్రహ్మ జ్ఞానం అబ్బింది అనుకోండి, అది వేరే విషయం.

ప్రదర్శన జరిగేటప్పుడు తీసే ఫొటోలు పాత్రికేయులు ఎలా తీస్తారో తెలీదు కాబట్టి, నాకు కొన్ని ప్రత్యేకంగా తీయమని మా మేకప్ మ్యాన్ కి కెమేరా ఇచ్చి కెమేరా మ్యాన్ చేసాను. అంతా సిద్ధం అయ్యాకా ప్రదర్శన మొదలు అయ్యింది. పేద్ద రంగస్థలం. ఉజ్జయిని అంటేనే కళలకు ఆలవాలం. అంచేత ఎందరో సంస్కృత పండితులు, సంగీత విద్వాంసులు, నాట్య కళ ని వెనక నుంచి ముందుకు చదివిన సమర్ధులు ఇలా అన్ని కళా రంగాల వారు వచ్చారు. ఒక మహా పండితుడు, తెలుగు వారే, ప్రదర్శన కి ముందు గ్రీన్ రూం కి వచ్చి, ఏమోయ్ యక్షుడి పాత్ర వేస్తు
న్నావంట కదా, నాకు పూర్వ మేఘం కంటే ఉత్తర మేఘం చాల ఇష్టం అయ్యా. చాలా బాగా చెయ్యాలి సుమా" అని ఒక చిరు నవ్వు నవ్వి వెళ్ళిపో యారు. (మేఘసందేశం, పూర్వ మేఘం ఉత్తర మేఘం అని రెండు భాగాలు గా ఉంటుంది). ఏదో పద్యాలన్ని బట్టీ పట్టాను కదా అని అప్పటి దాక మనల్ని మించినవాడు లేడు మనమే బాషా, ముత్తు, పెదడ్రాయరు ...సారి .. పెదరాయుడు అనుకున్న నేను సంస్కృతాంధ్రాలని అవపోసిన పట్టిన వాళ్ళముందు వాళ్ళకి నచ్చేలాగ చేయ్యటమంటే మైఖేల్ జాక్సన్ ముందు తీన్ మార్ వెయ్యటమే.

ప్రదర్శన ప్రారంభం అయ్యింది. నేను స్టేజి మీదకి వెళ్ళి నా భంగిమ లో నేను కూర్చున్నాను. ముందు ఒక 2 నిమిషాల వేణువు ఆలాపన తర్వాత "కశ్చిత్ కాంతా ...." అంటూ ప్రారంభం చెయ్యాల్సిన మా గాయకుడు, "చెక్ చెక్" అన్నాడు. నేను
ఆలాపన కే అభినయం మొదలు పెట్టడం తో మద్యలో ఒక యాంగిల్ లో ఫ్రీజ్ ఐపోయాను. అటు తిరిగి చూసాను. ఆ మైకులు అవి బిగించే వాడు ఆ మైక్ ని ఊది మావాడికి ఇస్తున్నాడు. ఇది మావాడి తప్పు కాదని తెలిసింది, లేకపోతే కురు వంశానికే కరువైపోయేవాడు. కాని మళ్ళీ వెంటనే మావాడు అందుకుని శ్లోకాలు మొదలు పెట్టాడు. మెల్లగా మెల్లగా రూపకం ఊపు అందుకుంది. రెండు భాగాలు పూర్తి అయ్యేసరికి ఒక గంటన్నర పట్టింది. నేను బ్యాక్ స్టేజి కి వచ్చేసరికి ఆ సంస్కృత పండితుడు వచ్చి "సెహభాష్.... చాల బాగా చేసావోయ్," అన్నారు. ఆ తర్వాత చాల మంది వచ్చి అభినందించారు.

మేకప్ వాడు వచ్చి వాడు తీసిన ఫొటొలు చూపించాడు. అందులో నేను లేను, నా ముఖం లేదు. నా పంచె, నా చెయ్యి, నా వీపు, వచ్చిన ప్రేక్షకులు, మైక్ సెట్స్ బిగించే వాళ్ళు, మేము ఆ ప్రదర్శన కి వేసుకు వచ్చిన వ్యాను, ఒక తింగర నవ్వు నవ్వుతూ వాడు, అక్కడకి వచ్చిన అమ్మాయిలు వీళ్ళందరూ ఉన్నారు. అంత మంచి ప్రోగ్రాం కి నాకు ఫొటొలు లేకపోవటం తో చాలా ఫీల్ అయ్యాను.

ఆ ప్రదర్శన కి ఇంత జరిగింది కాబట్టే ఇప్పటికీ మబ్బులని చూస్తే నాకు ఈ మేఘ సందేశం పద్య కావ్యమే మది లో మెలుగుతూ ఉంటుంది.