Thursday, May 15, 2008

పంచ పాత్రభినయం

బ్లాగ్ మిత్రులందరికీ అభివందనాలు.చాలా రోజులైంది మళ్ళీ బ్లాగు లోకి వచ్చి.
తియ్యటి జ్ఞాపకాలు గుర్తు వచ్చి ఒక సారి కలం విదిలిద్దామని వచ్చా.

నేను కూచిపూడి నేర్చుకునే మొదటి రోజుల్లో మా గురువు గారు డా. యశోద థాకోర్ గారు పరిపూర్ణ గంగ అని ఒక నృత్య రూపకం చేసారు. నాకు అప్పటికి అడవులు మాత్రమే అయ్యాయి. కానీ నా మీద నాకే లేని నమ్మకం మా గురువు గారికి వుందో ఎమో నాకు ఏకంగా ఐదు పాత్రలు ఇచ్చారు. అదృష్టం కొద్దీ పెద్ద పెద్ద జతులు ఎమీ పెట్టలేదు. కనీసం అడుగులు కూడా లేవు. అంతా అభినయమే. సరే ఇదేదొ బాగుందని, ఎక్కడో సినెమాల్లో తప్పా ఇలాంటి పంచ పాత్రాభినయాలు రావని ధైర్యం చేసాను.

నాకు ఈ విషయం చెప్పిన ఒక వారం లో సాధన మొదలయ్యింది.
నావి బలిచక్రవర్తి, జహ్ను మహర్షి, కపిల ముని, చైతన్య ప్రభు, చివరి లో గంగా దేవి వాహనం కూడా నేనే.
ఎన్నో కష్టాలు పడ్డకా నా సాధన ఒక కొలిక్కి వచ్చింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. రవీంద్రభారతి లో మొదటి ప్రదర్శన. చమటలు పట్టాయి.

"లావొక్కింతయు లేదు....." అన్న పద్యం గుర్తు వచ్చింది. ఇంకొంచెం భయం వేసింది. ఇలా ఐతె లాభం లేదని మేకప్ చేసే అతన్ని మాటల్లొకి దింపా. అసలు వేదిక మీద ఎలా నడిస్తె పంచె జారి పోదో, తల ఎలా పెడితె విగ్గు ఊడదో, అత్యవసర సమయల్లో ఏమి చెయ్యాల్లో ఇలాంటివి నిగూఢ రహస్యాలన్నీ రాబట్టాను.
రెండవ సీన్ నాదే కాబట్టి వినాయకుడు మొదలు అందరి దేవుళ్ళని ఒక్క సారి మననం చేసుకున్నాను. వేదిక మీద ఎమైనా పర్వాలెదు నా పంచె మాత్రం జాగ్రత్త గా కాపాడమని ఆర్ద్రత నిండిన కళ్ళ తో వేడుకున్నాను.

నా మొదటి సీన్ లో నేను బలి చక్రవర్తి ని. భార్య తో కూర్చుని యాగం చేస్తూ వుంటే వామనుడు వచ్చి మూడు అడుగులు అడిగే అపూర్వ ఘట్టం. రెండవ పాదం అకాశాన్ని ఆక్రమించినపుడు విష్ణుమూర్తి పాదలు బ్రహ్మ కడిగాడని ఆ నీరే గంగ గా మారిందని ఆ సీన్ లో భావం.

ఆ సీన్ మొదట్లో నే ఆ యజ్ఞం చేసే పేటిక లోంచి నిజం గానే మంట వచ్చింది. దెబ్బకి బిత్తర పోయాను. బలికి భార్య గా వేసిన ఆవిడ నా సీనియర్. ఆవిడకి తెలిసనుకుంట దాంట్లో కృత్రిమం గా మంట రావటనికి సెట్స్ వేసే వాళ్ళు ప్లాన్ చేసారని, ఆవిడ ఫక్కున నవ్వారు నేను జడుసుకోవటం చూసి. ఎదో కొంచెం ధైర్యవంతుణ్ణి కనుక పైకి పెద్ద కనపడనివ్వకుండా అభినయం తో కలిపేసాను. ఐనా ప్రేక్షకుల్లో చాలమంది కి తెలిసినట్లుంది నవ్వులు వినిపించాయి. దెబ్బతో అప్పటి దాక వున్న ధైర్యం ఆ మంటలోనె కలిసిపోయింది. ఏదో ఆ సీన్ అయ్యింది అనిపించి, మిగతా వేషాలు మాత్రం చాలా జాగ్రత్తగా చేసా.

కానీ చివరి లో వాహనం వేషం అయ్యిన తర్వాత గంగా దేవికి హారతి ఇచ్చే సీన్ పెట్టారు ఆ పాత్ర కూడా నేనే పోషించాల్సి వచ్చింది. నా ఖర్మ కి తోడు ఆ హారతి పళ్ళెం లో కర్పూరం బదులు మ్యాజిక్ క్యాండిల్స్ పెట్టారు. అవి ఒక పట్టాన ఆరవు అవ్వవు. చెయ్యి కాలి పోయింది. ఈ లోపు ఒక క్యాండిల్ పళ్ళెం లోంచి కింద పడింది. చెక్క వేదిక అంటుకు పోతుందేమో అని కాలు వేసి ఆర్పేసాను. అది సగం ఆరి నా అరి కాలు లో దాని ప్రతాపం చూపించింది. అమ్మా అని అరుద్దమన్నా సౌండు రాలేదు.

ఆ రోజు నేను అయ్యిన "బలి" అది. ఆ రోజు ఐన అనుభవం నాకు కొంత ధైర్యాన్ని ప్రసాదించింది. ఇంక తర్వత చేసిన అన్నీ ప్రదర్శనలూ చాల బాగా అయ్యయి. నేను ఇలా పై చదువుల కోసం షికాగో రావటం తో ఆ రోజులన్నీ వెళ్ళి పొయాయి.