Thursday, December 2, 2010

రాగం లో అనురాగం లో విరాగం

ఓసారి నా బి ఆర్క్ రెండో సంవత్సరం సెమిస్టర్ ఎగ్జాంస్ లో సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష అంత బాగా రాయలేదు. నేను ఆ పరీక్ష పాసయ్యి గట్టెక్కితే, లేదా నాతో పాటూ మిగిలిన వాళ్ళు కూడా ఫెయిల్ ఐతే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకొంటానని వెంకన్న కి మొక్కుకున్నాను. రిజల్ట్స్ వచ్చాయి. చాలా విచిత్రం గా నేను పాసయ్యాను. చాలా మంది ఫెయిల్ అయ్యారు.

Two birds at one shot రావడం తో ఆ ఆనందం తట్టుకోలేక ఆరోజు రాత్రే అందిన బస్సు పట్టుకుని తిరుపతి బయలుదేరాను. బస్సు స్టార్ట్ అయ్యిన ఒక 15 నిమిషాలకి క్లీనరు వచ్చి ఎదో సినిమా పెట్టాడు. పోనీలే బోరు కొట్టకుండా సినిమాతో టైం పాస్ ఔతుంది అని అనుకునే లోపు టీవీ స్క్రీను మీద సాయి కుమార్ నటించిన "పోలీస్ స్టోరీ" టైటిల్ పడింది. ఎటూ పారిపోలేని పరిస్థితులు కల్పించి ఆ సినిమా పెట్టిన క్లీనర్ గాడ్ని .. #$%^&*())(*&^%$#@!@# ...అని తిట్టుకుని, తెచ్చుకున్న దుప్పటీ మొహం మీద కప్పుకుని, చెవుల్లో దూది ముక్కలు కుక్కుకుని పడుకున్నాను. నిద్ర మధ్యలో అప్పుడప్పుడూ, "నీ యబ్బ !!!!!!!!! నరికేస్తా నా ...... లబ్బే నా........ బేవార్స్ నా...... ........" లాంటి ఆణి ముత్యాలవంటి అరుపులు వినిపించినా, నిద్రా దేవి సంపూర్ణ కరుణా కటాక్షాలు ప్రసరించి నిద్రాభంగం కాకుండా తెల్లారే సరికి తిరుమల చేరుకున్నాను.

ముందు గుండు చేయించుకుని స్నానం ముగించి, దర్శనానికి క్యూ లో జాయిన్ అయ్యి నించున్నాను. దూరం నుంచి ఘంటసాల గారి భగవద్గీత వినిపిస్తోంది. "అర్జునా మనుష్యుడు ఎటుల మాసిన వస్త్రమును వదిలి కొత్త వస్త్రము ధరించునో ఆత్మ అట్లే జీర్ణమైన శరీరం వదిలి కొత్త శరీరం ధరించుచున్నది."
నేను, "ఈ వెధవ శరీరం కోసమా కదా మనం ఇన్ని పాట్లు పడేది ఇది కేవలం మాసిన బట్ట మాత్రమే. ఇక నుంచి మోహాన్ని వదిలి మోక్షాన్ని ఆశ్రయించాలి." అని మనసులో అనుకున్నాను.

ఈలోపు అక్కడ ఉన్న మహా భక్త సందోహం లో ఓ నలుగురు టైం వేస్ట్ చెయ్యకుండా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యవసర సమస్యల మీద పిచ్చాపాటీ మొదలు పెట్టారు. వీళ్ళ గురించి ఈ కధ లో చాలా సార్లు ప్రస్తావించబడుతుంది కాబట్టి, వీళ్ళ పేర్లు నాకు తెలీదు కాబట్టి, మనకి తెలియని వాళ్ళని సుబ్బ్రావనో, వెంకట్రావనో పిలవడం పరిపాటి కాబట్టి వాళ్ళకి వెంకట్రావ్ గ్రూప్ అని పేరు పెట్టాను.

వాళ్ళలో ఓ వెంకట్రావ్ , "ఏంటో సార్ ఈ వెయిటింగు, మా బావమరిది కనుక ఊళ్ళో ఉండి ఉంటే ఈ పాటికి దర్శనం అయ్యి పోయి ప్రసాదం కూడ తింటూ ఉండే వాళ్ళము." అన్నాడు.
ఇంకో వెంకట్రావ్, "ప్రసాదం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ లడ్డూ లో జీడిపప్పు కలుపుతున్నారో లేదో? అసలు లడ్డూ లో జీడిపప్పు కలపక పోవటం ఏంటి సార్ దారుణం. తిరుపతి లడ్డూ ఫేమస్ అయ్యిందే దానివల్ల." అన్నాడు.
మూడో వెంకట్రావ్, "అంతా రాజకీయం సార్, రాజకీయం. ఈ దేశం మారదు. ఈ రాజకీయనాయకులందరినీ వరుసలో నించో పెట్టి షూట్ చేస్తే తప్ప ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు." అన్నాడు.
చివరి వెంకట్రావ్, " ఇంతకీ తెలంగాణా వస్తుందంటారా రాదంటారా. వస్తే ల్యాండ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా?" అన్నాడు.
మొదటి వెంకట్రావ్ నాకేసి తిరిగి, "మీరు ఏమంటారు వెంకట్రావుగారు." అన్నాడు.
నేను, "దేనిగురించి? లడ్డూ గురించా? తెలంగాణా గురించా?".
వాడు, "లడ్డూ గురించి సార్."
నేను, "నేను స్వీట్లు తినను." అని చెప్పి మళ్ళీ కదిలిస్తాడేమో అని ఇంకో పక్కకి చూసాను.

అంతే !!!!, ఎవరో మంత్రం వేసినట్లు నా కళ్ళు అటే చూస్తూ ఉండి పోయాయి.
ఒక అమ్మాయి .... స్వర్గంలో అప్సరసలు నాట్యం చేస్తుంటే, వాళ్ళలో ఒకరు ఆ డాన్స్ చేస్తూ చేస్తూ పొరపాటున కాలు స్లిప్ అయ్యి మెట్లమించి జారిపోయి, నాకోసం భూలోకం వచ్చి నా పక్కన నిలుచుందా!!!! అన్న ఫీలింగ్.

ఇహ మనిషి, మాసిన వస్త్రం, ఆత్మ ఇవి ఏమీ గుర్తు రావట్లేదు. మనసు నిండా ఆ అమ్మాయే. హు....... మా క్లాసులోనూ ఉన్నారు అమ్మాయిలు ఎందుకు. ఈ అమ్మాయిని చూడు చెంపకి చారెడు కళ్ళేసుకుని ఎంత అందం గా ఉంది. నాకు తగిన అమ్మాయి గుళ్ళో నే ఎదురౌతుందని ఓసారి చిలక జోస్యం వాడు కూడా చెప్పాడు.

ఇంతలో............
తిరుపతి లో స్వామి దర్శనానికి వచ్చి ఇలా అమ్మాయికి లైను వేయటం తప్పేమో అనిపించింది. ఇది ఒక ధర్మ సంకట స్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో నా బుద్ధి, నా మనసు రెండూ సూక్ష్మ దేహాలు ధరించి నా చెవుల పక్కకి చేరి తర్క జ్ఞాన బోధ చేస్తాయి.
బుద్ధి, " ఔను తప్పే రా.." అంది.
మనసు, "భగవంతుడే నీకోసం పంపినపుడు తిరస్కరిస్తే ఆయనకి కోపం వస్తుందని" బుద్ధి కి సర్ది చెప్పింది.
"అంటే భగవంతుడు ఇలాంటివి వరాలు కూడ గ్రాంట్ చేస్తాడా?" అని బుద్ధి మనసుని ప్రశ్నించింది.
"నువ్వు మూసుకుని లైను వెయ్యి బే, లేకపోతే ఇంకోడు రెడీ గా నీ వెనకాలే ఉన్నాడు" అని బుద్ధి మీద మనసు జయించింది.
సరిగ్గా అదే సమయం లో ఘంటసాల గారు, "కర్మణ్యేవాధికారస్తే ............." శ్లోకం పాడారు.

పని చెయ్యటమే మనవంతు. ఫలితం దేవుడికివదిలేద్దాం అని ఘంటసాల గారికి ఒక థ్యాంక్స్ చెప్పి ఆ అమ్మాయికి లైను వేసే పని లో నిమగ్నమయ్యాను. ఆ అమ్మాయి కూడా నన్ను చూస్తూ సిగ్గు పడటం మొదలు పెట్టింది.

ఈలోపు ఇటు పక్కన చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వాళ్ళలో ఓ వెంకట్రావ్, నాకేసి తిరిగి "మీరు ఏమంటారు సార్" అన్నాడు.
లైను వేసే పని లో అంతవరకూ వాళ్ళ మాటలు వినని నేను అర్ధం కాక, "దేనిగురించి?" అన్నాను.
అతను, "అదే సార్ ముమ్మైత్ ఖాన్ కి పెళ్ళి అయ్యిందా లేదా అని మాట్లాడు కుంటున్నాం కదా దాని గురించి" అన్నాడు. అసలు వీళ్ళు తిరుపతి లడ్డూ నుంచి ముమ్మైత్ ఖాన్ దగ్గరకి ఎలా వెళ్ళారో అర్ధం కాక ఏదో ఒకటి చెప్పాలని, "లేదు" అన్నాను.
దానికి అతను మిగతా వాళ్ళతో, "చెప్పానా, చెప్పానా" అని గంతులు వేసాడు. నేను వాళ్ళ సంగతి వదిలి మళ్ళీ నా పని లో నిమగ్నమయ్యాను.

ఆ అమ్మాయిని చూస్తూ నడుస్తున్నాను. జీవితం లో ప్రతీ క్షణం ఇలా ఆ అమ్మాయిని చూస్తూ ఉండి పోవాలనిపించింది. తను కూడా నాకేసి చూసి కాస్త నవ్వే టైం కి, పక్కనున్న వెంకట్రావ్, ఆ అమ్మాయికి నాకు మధ్యలోకి వచ్చి నా మొహం లో మొహం పెట్టి "మీరేవంటారు?" అన్నాడు.

శుద్ధ హిందోళం లో రిషభం లా ఎవడ్రా వీడు అనుకుని "అయ్యా వృషభ వెంకట్రావ్ గారు, మీరు నన్ను వదిలేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను" అన్నాను. దానికి అతను బాగా హర్ట్ అయ్యి మళ్ళీ చర్చలో మునిగిపోయాడు.

ఈ లోపు ఆ అమ్మాయి జడలోంచి ఒక గులాబీ పువ్వు జారి కింద పడింది. నా పక్కనున్న వెంకట్రావ్ చూసుకోకుండా ఆ పువ్వుని తొక్కెయ్యబోతుంతే నా అరచెయ్యి ఆ పువ్వు మీద బోర్లించి పెట్టాను. యే జాలీ లేకుండా ఆ వృషభ వెంకట్రావ్ నా చెయ్యి ని గంగిరెద్దు గొబ్బెమని తొక్కినట్లు తొక్కేసాడు. నెప్పి తో మనసులో వెర్రి కేకలు వేస్తున్నా చిరునవ్వు చెక్కు చెదరకుండా ఆ పువ్వు ఆ అమ్మాయి కి ఇచ్చాను. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. నా మనసు "జనక,... జజ్జనక ..." అంటూ పులి డాన్స్ మొదలు పెట్టింది.

ఇంక గర్భ గుడి దగ్గరకి రాగానే, "ఇప్పటికైనా నన్ను చూడరా" అని స్వామి పిలిచినట్లనిపించి, అటు తిరిగాను. తిరగగానే గర్భ గుడి గుమ్మానికి నా గుండు టంగుమని కొట్టుకుంది. వెనకనుంచి ఒక వెంకట్రావ్ దబ్భేల్ అని తోసాడు. నా గుండు మళ్ళీ వెళ్ళి గుమ్మానికి కొట్టుకుంది. గడపకి కాలు తన్నుకుని బొక్క బోర్లా పడిపోయాను. నా వెనకాల వస్తున్న నలుగురు వెంకట్రావులూ నన్ను తొక్కేసుకుంటూ "గోవిందా .......గో......విందా" అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఫక్కున నవ్వింది.

ఇదంతా కొన్ని సెకన్లలో జరిగిపోయినిది. ఇంతలో ఎవరో ఓ పెద్దాయన నన్ను లేపి. స్వామి దగ్గరకి నడిపించుకుని వెళ్ళాడు. ఆ దెబ్బలని ఒత్తుకుంటూ, స్వామి కి చెమర్చిన కళ్ళతో నమస్కరించాను. స్వామి కూడా నాకేసి దీనం గా చూస్తూ ఉన్నట్లనిపించింది. ఇంకాస్త ఏడుపొచ్చింది.

అడుగు లో అడుగు వేసుకుంటూ బయటకి వెళ్ళి ఆ పులిహొర ప్రసాదం తీసుకుని ఓ అరుగు మీద కూర్చున్నాను. ఆ అమ్మాయి, మళ్ళీ కనిపించలేదు. దూరం గా ఘంటసాల గారు, "విషయవాంచల గూర్చి సదా ఆలోచించు వానికి దానియందు అనురాగం అధికమై అది కామముగా మారి, అది దక్కని చో క్రోధమై, వివేకము పోయి బుద్ధిచలించి, గుండు మీద దెబ్బ తగులును" అన్నారు. ఉక్రోషం వచ్చింది. ఔను నిజమే లేకపోతే ఇందాకటి వరకూ నన్ను చూసి సిగ్గుపడిన అమ్మాయి, నన్ను తోసేసి కింద పడేసి తొక్కేస్తే అలా నవ్వుతుందా?? అని మనసు ఆక్రందించింది.

గుండు మీద గాటు, గుండెల్లో గాయం అవ్వటంతో, "ఛ, ఛ, ..... ఇంక జీవితం లో యే అమ్మాయికీ లైను వెయ్యకూడదు. ప్రమాదం ఎప్పుడూ మన నీడలా మనవెంటే ఉండి, గుళ్ళో వెనకనుంచి తోసేస్తుంది. ఐనా ఈ అమ్మాయి యేమీ అంత బాలేదు. మా క్లాసు అమ్మాయిలే నయం. కనీసం అప్పుడప్పుడూ బాగుంటారు" అనుకుని, మనసుకి మందు పూసుకుంటూ ఆరోజు తిరపతి లో గడిపి సాయంత్రానికి బస్సు ఎక్కాను.

నా సీట్లో కూర్చున్న కాసేపటికి ఒక అమ్మాయి వచ్చి నాకు అటు పక్కన సీట్లో కూర్చుంది. అప్పటికే ఒక దురదృష్ట సంఘటన అయ్యేసరికి ఈ అమ్మాయిని చూడకూడదని నిర్ణయించుకున్నాను.
కాసేపాగాకా మనసు దెబ్బలనుంచి తేరుకుంది. "ఇందాకా అంటే ఎవడో తోసేసాడు కాబట్టి అలా అవమానం పాలు అయ్యాం కానీ, అస్తమాను అలా ఔతామా ఏంటి??" అని అడిగింది.
బుద్ధి, "ఒరేయ్ !!! మళ్ళీ దెబ్బ తింటావ్ రో" అంది.
మనసు, "యూత్ లో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ మావా?" అంది.
బుద్ధి, "నీకు ఈ జన్మకి బుద్ధి రాదు రా........ ఛీ ...ఛీ... ఛీ.." అంది.
మనసు బుద్ధి ని, "వ్వె, వ్వె, వ్వె ....." అని వెక్కిరించి లైను వెయ్యటానికి సమాయుత్తమయ్యింది.

మనసు నీతి లేని కోతి లాంటిది అని జంధ్యాల గారు ఉత్తినే అన్నారా.

6 comments:

Anonymous said...

funtastic. very good writing style. pl. continue writing.

కొత్త పాళీ said...

భలే భలే.
ప్రేమాయణంలో భగవద్గీత బహు రంజుగా రంగరించారు.
అవునుమరి, భగవంతుడి దర్శనం కోసం లైనులో ఉన్నప్పుడు మన ముందు కళ్ళు జిగేల్మనిపించే అప్సరస కనిపిస్తే ఆమెని ఆ భగవంతుడే పంపినట్లే కదా!
మీరు టపా మొదట్లో ఒక్క దెబ్బకి కొట్టిన రెండు పిట్టలేవో మాత్రం అర్ధం కాలేదు!

Pavan Kumar said...

Very good chakri!!! aaa second story kuda continue chesi climax lo oka manchi message isthe bagundedhi..:)

Chakrapani Duggirala said...

@ కొత్త పాళీ గారు .....2 పిట్టలు అంటే ఒకటి నేను పాస్ అవ్వటం రెండు చాలా మంది ఫెయిల్ అవ్వటం అన్నమాట :)

sri said...

చదువుతుంటే ఆ వెంకట్రావ్ లు, భగవద్గీత స్వరాలూ కళ్ళ ముందుంచారు,పక్కచూపులు సరే సరి. బావుంది.

karlapalem Hanumantha Rao said...

కథనం సరదాగా సాగింది. చెయి తిరిగుంటేగానీ ఈ ప్రవాహం ఇంత సులభంగా సాగదు. అభినందనలు