Saturday, June 19, 2010

అరాళ కుంతలా

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా
చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద
అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.
"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.
ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి
"నీ పేరు" అన్నారు.
-చక్రపాణి-
"గోత్రం"
-అరాళ కుంతల-
పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.
"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా
ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

12 comments:

Chari Dingari said...

arala ante enugu...enugu laanti nallani kurulu kaladi

శిశిర said...

:)మీరు రాసిన విధానం చాలా బాగుంది.

Chaitu said...

super!!

ఊకదంపుడు said...

:)
ఇంకా నయం, మీరు నాలాగా
అరాళ కుంతల =రాలని కుంతలములు గలది
అరాళ కుంతల= ఱ,ళ ఆకారములో గిరజాల జుట్టుగలది అని
వ్యుత్పత్తులు చెప్పుకున్నారు కాదు. మీరు తఱచుగా వ్రాస్తే బావుంటుంది, సంగీత.సాహిత్యనృత్యములలో రాణించినవారు, చెప్పటనికి ఈనో విషయాలు ఉంటాయి - వీలు చేసుకొని వ్రాయమని మనవి.
అభినందనలతో
ఊకదంపుడు

Unknown said...

"తుమ్మెద రెక్కల వంటి నల్లని కురులు కలది" అని ఎక్కడో చదివినట్టు/విన్నట్లు గుర్తు.

ఇంతకీ, అర్థరాజ్యం ఎవరికి వచ్చింది? సూర్యప్రభ ఎవరికి దక్కింది?

బాగుంది మీ టపా.

భావన said...

మొత్తానికి సరైన అర్ధమే కనిపెట్టి శాప విమోచనం సాధించారు. :-) బాగా రాసేరు.

ఆ.సౌమ్య said...

హ హ హ రాసిన విదానం బాగుంది. బాగా నవ్వించారు. ఎందుకండీ అంతకష్టపడడం, నన్నడిగితే వెంటనే చెప్పేసేదాన్ని కదా....అనవసరంగా శాపాలపాలు అయ్యారు! విమోచనం అయినందుకు సంతోషం.

Kummetha said...

well done chakri... very entertaining...

Vasantha said...

Meeru rasina vidhanam chala bavundi.mee valana naku kuda ardham telisi sapavimochanam ayyindi..dhanyavadamulu

Anonymous said...

ఎప్పుడో ఈ పాఠం చెప్పిన మా తెలుగు మాస్టారు ఉంగరాల జుత్తు అనే అర్థం ఖరాఖండీగా చెప్పారు. ఇది 1965 మాట

శ్యామలీయం said...

పొరపాటు.

శ్యామలీయం said...

ఇది సరైన అర్ధం.