Thursday, December 2, 2010

రాగం లో అనురాగం లో విరాగం

ఓసారి నా బి ఆర్క్ రెండో సంవత్సరం సెమిస్టర్ ఎగ్జాంస్ లో సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష అంత బాగా రాయలేదు. నేను ఆ పరీక్ష పాసయ్యి గట్టెక్కితే, లేదా నాతో పాటూ మిగిలిన వాళ్ళు కూడా ఫెయిల్ ఐతే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకొంటానని వెంకన్న కి మొక్కుకున్నాను. రిజల్ట్స్ వచ్చాయి. చాలా విచిత్రం గా నేను పాసయ్యాను. చాలా మంది ఫెయిల్ అయ్యారు.

Two birds at one shot రావడం తో ఆ ఆనందం తట్టుకోలేక ఆరోజు రాత్రే అందిన బస్సు పట్టుకుని తిరుపతి బయలుదేరాను. బస్సు స్టార్ట్ అయ్యిన ఒక 15 నిమిషాలకి క్లీనరు వచ్చి ఎదో సినిమా పెట్టాడు. పోనీలే బోరు కొట్టకుండా సినిమాతో టైం పాస్ ఔతుంది అని అనుకునే లోపు టీవీ స్క్రీను మీద సాయి కుమార్ నటించిన "పోలీస్ స్టోరీ" టైటిల్ పడింది. ఎటూ పారిపోలేని పరిస్థితులు కల్పించి ఆ సినిమా పెట్టిన క్లీనర్ గాడ్ని .. #$%^&*())(*&^%$#@!@# ...అని తిట్టుకుని, తెచ్చుకున్న దుప్పటీ మొహం మీద కప్పుకుని, చెవుల్లో దూది ముక్కలు కుక్కుకుని పడుకున్నాను. నిద్ర మధ్యలో అప్పుడప్పుడూ, "నీ యబ్బ !!!!!!!!! నరికేస్తా నా ...... లబ్బే నా........ బేవార్స్ నా...... ........" లాంటి ఆణి ముత్యాలవంటి అరుపులు వినిపించినా, నిద్రా దేవి సంపూర్ణ కరుణా కటాక్షాలు ప్రసరించి నిద్రాభంగం కాకుండా తెల్లారే సరికి తిరుమల చేరుకున్నాను.

ముందు గుండు చేయించుకుని స్నానం ముగించి, దర్శనానికి క్యూ లో జాయిన్ అయ్యి నించున్నాను. దూరం నుంచి ఘంటసాల గారి భగవద్గీత వినిపిస్తోంది. "అర్జునా మనుష్యుడు ఎటుల మాసిన వస్త్రమును వదిలి కొత్త వస్త్రము ధరించునో ఆత్మ అట్లే జీర్ణమైన శరీరం వదిలి కొత్త శరీరం ధరించుచున్నది."
నేను, "ఈ వెధవ శరీరం కోసమా కదా మనం ఇన్ని పాట్లు పడేది ఇది కేవలం మాసిన బట్ట మాత్రమే. ఇక నుంచి మోహాన్ని వదిలి మోక్షాన్ని ఆశ్రయించాలి." అని మనసులో అనుకున్నాను.

ఈలోపు అక్కడ ఉన్న మహా భక్త సందోహం లో ఓ నలుగురు టైం వేస్ట్ చెయ్యకుండా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యవసర సమస్యల మీద పిచ్చాపాటీ మొదలు పెట్టారు. వీళ్ళ గురించి ఈ కధ లో చాలా సార్లు ప్రస్తావించబడుతుంది కాబట్టి, వీళ్ళ పేర్లు నాకు తెలీదు కాబట్టి, మనకి తెలియని వాళ్ళని సుబ్బ్రావనో, వెంకట్రావనో పిలవడం పరిపాటి కాబట్టి వాళ్ళకి వెంకట్రావ్ గ్రూప్ అని పేరు పెట్టాను.

వాళ్ళలో ఓ వెంకట్రావ్ , "ఏంటో సార్ ఈ వెయిటింగు, మా బావమరిది కనుక ఊళ్ళో ఉండి ఉంటే ఈ పాటికి దర్శనం అయ్యి పోయి ప్రసాదం కూడ తింటూ ఉండే వాళ్ళము." అన్నాడు.
ఇంకో వెంకట్రావ్, "ప్రసాదం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ లడ్డూ లో జీడిపప్పు కలుపుతున్నారో లేదో? అసలు లడ్డూ లో జీడిపప్పు కలపక పోవటం ఏంటి సార్ దారుణం. తిరుపతి లడ్డూ ఫేమస్ అయ్యిందే దానివల్ల." అన్నాడు.
మూడో వెంకట్రావ్, "అంతా రాజకీయం సార్, రాజకీయం. ఈ దేశం మారదు. ఈ రాజకీయనాయకులందరినీ వరుసలో నించో పెట్టి షూట్ చేస్తే తప్ప ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు." అన్నాడు.
చివరి వెంకట్రావ్, " ఇంతకీ తెలంగాణా వస్తుందంటారా రాదంటారా. వస్తే ల్యాండ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా?" అన్నాడు.
మొదటి వెంకట్రావ్ నాకేసి తిరిగి, "మీరు ఏమంటారు వెంకట్రావుగారు." అన్నాడు.
నేను, "దేనిగురించి? లడ్డూ గురించా? తెలంగాణా గురించా?".
వాడు, "లడ్డూ గురించి సార్."
నేను, "నేను స్వీట్లు తినను." అని చెప్పి మళ్ళీ కదిలిస్తాడేమో అని ఇంకో పక్కకి చూసాను.

అంతే !!!!, ఎవరో మంత్రం వేసినట్లు నా కళ్ళు అటే చూస్తూ ఉండి పోయాయి.
ఒక అమ్మాయి .... స్వర్గంలో అప్సరసలు నాట్యం చేస్తుంటే, వాళ్ళలో ఒకరు ఆ డాన్స్ చేస్తూ చేస్తూ పొరపాటున కాలు స్లిప్ అయ్యి మెట్లమించి జారిపోయి, నాకోసం భూలోకం వచ్చి నా పక్కన నిలుచుందా!!!! అన్న ఫీలింగ్.

ఇహ మనిషి, మాసిన వస్త్రం, ఆత్మ ఇవి ఏమీ గుర్తు రావట్లేదు. మనసు నిండా ఆ అమ్మాయే. హు....... మా క్లాసులోనూ ఉన్నారు అమ్మాయిలు ఎందుకు. ఈ అమ్మాయిని చూడు చెంపకి చారెడు కళ్ళేసుకుని ఎంత అందం గా ఉంది. నాకు తగిన అమ్మాయి గుళ్ళో నే ఎదురౌతుందని ఓసారి చిలక జోస్యం వాడు కూడా చెప్పాడు.

ఇంతలో............
తిరుపతి లో స్వామి దర్శనానికి వచ్చి ఇలా అమ్మాయికి లైను వేయటం తప్పేమో అనిపించింది. ఇది ఒక ధర్మ సంకట స్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో నా బుద్ధి, నా మనసు రెండూ సూక్ష్మ దేహాలు ధరించి నా చెవుల పక్కకి చేరి తర్క జ్ఞాన బోధ చేస్తాయి.
బుద్ధి, " ఔను తప్పే రా.." అంది.
మనసు, "భగవంతుడే నీకోసం పంపినపుడు తిరస్కరిస్తే ఆయనకి కోపం వస్తుందని" బుద్ధి కి సర్ది చెప్పింది.
"అంటే భగవంతుడు ఇలాంటివి వరాలు కూడ గ్రాంట్ చేస్తాడా?" అని బుద్ధి మనసుని ప్రశ్నించింది.
"నువ్వు మూసుకుని లైను వెయ్యి బే, లేకపోతే ఇంకోడు రెడీ గా నీ వెనకాలే ఉన్నాడు" అని బుద్ధి మీద మనసు జయించింది.
సరిగ్గా అదే సమయం లో ఘంటసాల గారు, "కర్మణ్యేవాధికారస్తే ............." శ్లోకం పాడారు.

పని చెయ్యటమే మనవంతు. ఫలితం దేవుడికివదిలేద్దాం అని ఘంటసాల గారికి ఒక థ్యాంక్స్ చెప్పి ఆ అమ్మాయికి లైను వేసే పని లో నిమగ్నమయ్యాను. ఆ అమ్మాయి కూడా నన్ను చూస్తూ సిగ్గు పడటం మొదలు పెట్టింది.

ఈలోపు ఇటు పక్కన చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వాళ్ళలో ఓ వెంకట్రావ్, నాకేసి తిరిగి "మీరు ఏమంటారు సార్" అన్నాడు.
లైను వేసే పని లో అంతవరకూ వాళ్ళ మాటలు వినని నేను అర్ధం కాక, "దేనిగురించి?" అన్నాను.
అతను, "అదే సార్ ముమ్మైత్ ఖాన్ కి పెళ్ళి అయ్యిందా లేదా అని మాట్లాడు కుంటున్నాం కదా దాని గురించి" అన్నాడు. అసలు వీళ్ళు తిరుపతి లడ్డూ నుంచి ముమ్మైత్ ఖాన్ దగ్గరకి ఎలా వెళ్ళారో అర్ధం కాక ఏదో ఒకటి చెప్పాలని, "లేదు" అన్నాను.
దానికి అతను మిగతా వాళ్ళతో, "చెప్పానా, చెప్పానా" అని గంతులు వేసాడు. నేను వాళ్ళ సంగతి వదిలి మళ్ళీ నా పని లో నిమగ్నమయ్యాను.

ఆ అమ్మాయిని చూస్తూ నడుస్తున్నాను. జీవితం లో ప్రతీ క్షణం ఇలా ఆ అమ్మాయిని చూస్తూ ఉండి పోవాలనిపించింది. తను కూడా నాకేసి చూసి కాస్త నవ్వే టైం కి, పక్కనున్న వెంకట్రావ్, ఆ అమ్మాయికి నాకు మధ్యలోకి వచ్చి నా మొహం లో మొహం పెట్టి "మీరేవంటారు?" అన్నాడు.

శుద్ధ హిందోళం లో రిషభం లా ఎవడ్రా వీడు అనుకుని "అయ్యా వృషభ వెంకట్రావ్ గారు, మీరు నన్ను వదిలేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను" అన్నాను. దానికి అతను బాగా హర్ట్ అయ్యి మళ్ళీ చర్చలో మునిగిపోయాడు.

ఈ లోపు ఆ అమ్మాయి జడలోంచి ఒక గులాబీ పువ్వు జారి కింద పడింది. నా పక్కనున్న వెంకట్రావ్ చూసుకోకుండా ఆ పువ్వుని తొక్కెయ్యబోతుంతే నా అరచెయ్యి ఆ పువ్వు మీద బోర్లించి పెట్టాను. యే జాలీ లేకుండా ఆ వృషభ వెంకట్రావ్ నా చెయ్యి ని గంగిరెద్దు గొబ్బెమని తొక్కినట్లు తొక్కేసాడు. నెప్పి తో మనసులో వెర్రి కేకలు వేస్తున్నా చిరునవ్వు చెక్కు చెదరకుండా ఆ పువ్వు ఆ అమ్మాయి కి ఇచ్చాను. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. నా మనసు "జనక,... జజ్జనక ..." అంటూ పులి డాన్స్ మొదలు పెట్టింది.

ఇంక గర్భ గుడి దగ్గరకి రాగానే, "ఇప్పటికైనా నన్ను చూడరా" అని స్వామి పిలిచినట్లనిపించి, అటు తిరిగాను. తిరగగానే గర్భ గుడి గుమ్మానికి నా గుండు టంగుమని కొట్టుకుంది. వెనకనుంచి ఒక వెంకట్రావ్ దబ్భేల్ అని తోసాడు. నా గుండు మళ్ళీ వెళ్ళి గుమ్మానికి కొట్టుకుంది. గడపకి కాలు తన్నుకుని బొక్క బోర్లా పడిపోయాను. నా వెనకాల వస్తున్న నలుగురు వెంకట్రావులూ నన్ను తొక్కేసుకుంటూ "గోవిందా .......గో......విందా" అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఫక్కున నవ్వింది.

ఇదంతా కొన్ని సెకన్లలో జరిగిపోయినిది. ఇంతలో ఎవరో ఓ పెద్దాయన నన్ను లేపి. స్వామి దగ్గరకి నడిపించుకుని వెళ్ళాడు. ఆ దెబ్బలని ఒత్తుకుంటూ, స్వామి కి చెమర్చిన కళ్ళతో నమస్కరించాను. స్వామి కూడా నాకేసి దీనం గా చూస్తూ ఉన్నట్లనిపించింది. ఇంకాస్త ఏడుపొచ్చింది.

అడుగు లో అడుగు వేసుకుంటూ బయటకి వెళ్ళి ఆ పులిహొర ప్రసాదం తీసుకుని ఓ అరుగు మీద కూర్చున్నాను. ఆ అమ్మాయి, మళ్ళీ కనిపించలేదు. దూరం గా ఘంటసాల గారు, "విషయవాంచల గూర్చి సదా ఆలోచించు వానికి దానియందు అనురాగం అధికమై అది కామముగా మారి, అది దక్కని చో క్రోధమై, వివేకము పోయి బుద్ధిచలించి, గుండు మీద దెబ్బ తగులును" అన్నారు. ఉక్రోషం వచ్చింది. ఔను నిజమే లేకపోతే ఇందాకటి వరకూ నన్ను చూసి సిగ్గుపడిన అమ్మాయి, నన్ను తోసేసి కింద పడేసి తొక్కేస్తే అలా నవ్వుతుందా?? అని మనసు ఆక్రందించింది.

గుండు మీద గాటు, గుండెల్లో గాయం అవ్వటంతో, "ఛ, ఛ, ..... ఇంక జీవితం లో యే అమ్మాయికీ లైను వెయ్యకూడదు. ప్రమాదం ఎప్పుడూ మన నీడలా మనవెంటే ఉండి, గుళ్ళో వెనకనుంచి తోసేస్తుంది. ఐనా ఈ అమ్మాయి యేమీ అంత బాలేదు. మా క్లాసు అమ్మాయిలే నయం. కనీసం అప్పుడప్పుడూ బాగుంటారు" అనుకుని, మనసుకి మందు పూసుకుంటూ ఆరోజు తిరపతి లో గడిపి సాయంత్రానికి బస్సు ఎక్కాను.

నా సీట్లో కూర్చున్న కాసేపటికి ఒక అమ్మాయి వచ్చి నాకు అటు పక్కన సీట్లో కూర్చుంది. అప్పటికే ఒక దురదృష్ట సంఘటన అయ్యేసరికి ఈ అమ్మాయిని చూడకూడదని నిర్ణయించుకున్నాను.
కాసేపాగాకా మనసు దెబ్బలనుంచి తేరుకుంది. "ఇందాకా అంటే ఎవడో తోసేసాడు కాబట్టి అలా అవమానం పాలు అయ్యాం కానీ, అస్తమాను అలా ఔతామా ఏంటి??" అని అడిగింది.
బుద్ధి, "ఒరేయ్ !!! మళ్ళీ దెబ్బ తింటావ్ రో" అంది.
మనసు, "యూత్ లో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ మావా?" అంది.
బుద్ధి, "నీకు ఈ జన్మకి బుద్ధి రాదు రా........ ఛీ ...ఛీ... ఛీ.." అంది.
మనసు బుద్ధి ని, "వ్వె, వ్వె, వ్వె ....." అని వెక్కిరించి లైను వెయ్యటానికి సమాయుత్తమయ్యింది.

మనసు నీతి లేని కోతి లాంటిది అని జంధ్యాల గారు ఉత్తినే అన్నారా.

Tuesday, September 21, 2010

జాబు - జవాబు - జీతం

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఈ సామెత జాబ్ ఇంటర్వ్యూస్ కి ఖచ్చితం గా సరిపోతుంది.

నా జీవితం లో మొట్ట మొదట ఇంటర్వ్యూకి హాజరు అయ్యినది, నా 18 ఏళ్ళ వయస్సులో నేషనల్ డిఫెన్స్ సెలక్షన్స్ కి వెళ్ళినప్పుడు. అస్సలు అనుభవం లేని నేను, ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి నా ఆహార్యం తోనే మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలని అన్నీ హంగులు చేసి, కాస్త దైవ భక్తి ఉన్నట్లు కనపడితే ఇంకొంచెం ఎక్కువ మార్కులు నొక్కెయ్యొచ్చని, మా ఊరి గుళ్ళో రామప్ప ప్పంతులుగారు పెట్టుకున్నట్లు పొడుగు బొట్టు పెట్టుకుని ఠీవిగా ఆ హాలులో ప్రవేశించాను.

ఇంటర్వ్యూయర్ నన్ను చూడగానే, "నీ నుదిటి మీద రక్తం వస్తొంది.... ఏం జరిగింది?" అని అడిగారు. నేను నా భక్తిభాగోతం చెప్పగానే ఆయన, "భక్తి తో భారత దేశాన్ని కాపాడేద్దామని వచ్చావా నాయనా? సరే కూర్చో" అన్నారు. కాసిని వ్యక్తిగత ప్రశ్నలు అడిగిన తర్వాత, కొన్ని సిచుయేషనల్ ప్రశ్నలు అడిగారు.

ప్రశ్న: "నువ్వు అడివిలో వెళుతున్నావు. నీకు ఒక పులి ఎదురైంది. అది బాగా ఆకలి మీద ఉంది. నువ్వు నీరసం గా ఉన్నావు. అప్పుడు ఏమి చేస్తావు?"
నేను: "నాకు వచ్చే జన్మ లో ఐనా ఇలా ఇంటర్వ్యూలకి వెళ్ళే దౌర్భాగ్యం కలగకుండా బాగా ఆస్తిని ఇవ్వమని కడసారి గా దేవుణ్ణి ప్రార్ధిస్తాను."

ప్రశ్న: "మీఇంట్లొ నువ్వు ఏదైనా పనులు చేస్తూ ఉంటావా?"
నేను: "ఆయ్!!!!! మా అమ్మగారిని అసలు కాలు కింద పెట్టనివ్వనండి." 

దానికి ఆయన, "ఔనా!!!!!!!! మీఇంట్లో నీ బట్టలు ఎవరు ఉతుకుతారు నాయనా?" అన్నారు.
నేను: "మా అమ్మగారండి." అని నాలిక కరుచుకున్నాను. (దీన్నే contradicting your own statement అంటారని తరవాత తెలిసింది)
యేది యేమైనా నా నిజాయితీ, పాజిటివ్ ఆటిట్యూడ్, భవిష్యత్ ప్రణాళికలు చూసి నన్ను సెలక్ట్ చేస్తాడు అనుకున్నా, కానీ సెలక్ట్ కాలేదు.

(4 సంవత్సరాలు తర్వాత.........)
నా ఆర్కిటెక్చర్ పూర్తి అయ్యింది, ఒక కంపెనీ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పటికి కూడ నాకు ఇంటర్వ్యూ ని సమర్ధవంతం గా ఎదుర్కొనే యుక్తులు వంటబట్టలేదు. నా ఇంటర్వ్యూ మొదలయ్యింది.

ప్రశ్న: "నీ గురించి చెప్పుకో"
నేను: "ఎవరి పేరు చెపితే సీమ ప్రజలు ....."
నన్ను ఆపి, "చిరంజీవి గురించి కాదు. నీ గురించి చెప్పు" అన్నాడు.
నేను తెలుగు మహాభారతం లోని, "ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు, రాజభూషణ రజో రాజినడగు ..." అనే ధర్మరాజుని పొగిడే పద్యం స్టార్ట్ చేసాను.
ఆయన తల పట్టుకుని, "కొంచెం తెలుగు లో చెప్పు బాబు." అన్నారు.
"నేను ఒక ఆర్కిటెక్ట్ ని" అన్నాను.
ఆయన, "ఆర్కిటెక్ట్ అంటే?" అన్నాడు.

నేను వెంటనే, "ఆర్కిటెక్ట్ అంటే....ధాతా రాతిరాతిర్ధాతా, ధాత రాతి సవితా సవితా. రాతిర్ధాత ధాత రాతిర్ సవితా రాతిర్ సవితా సవితేదం ఇదం సవితా........" అన్నాను.

ఇంటర్వ్యూయర్ భరించలేక నా రెస్యూమె లోని మొదటి పేపర్ ని చింపేసి, చిరాగ్గా మొహం పెట్టి, "నీ బలాలుబలహీనతలు ఏంటి?" అని అడిగాడు.
ఎంతో కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ ఐతే అసలు కోర్స్ కి సంబంధించిన ప్రశ్నలుమానేసి దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతున్నాడని నాకు చిరాకొచ్చింది.
నేను: "బలం: హనుమాన్ చాలీసా; బలహీనతలు: ఇలియానా, జెనీలియా" అన్నాను.

నాకు ఆ ఉద్యోగం రాలేదు. ఈ సారి "How To crack interviews?" అనే కోచింగ్ చెంటర్ లో చేరాను. వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎక్కడికి వెళ్ళినా కోర్స్ కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే కాకుండా, కొన్ని రొటీన్, ప్రశ్నలు ఉంటాయి. "నీ గురించి చెప్పు", "నీ బలహీనతలు ఏంటి", "నీ బలాలు, బలగాలు ఏంటి" లాంటివి. అసలు కరచాలనం లోనే మన వ్యక్తిత్వం తెలిసే సైన్సు ఎదో ఒకటి ఉందని అప్పుడే తెలిసింది. కరచాలనం ఎంత బలంగా ఇస్తే మనకి అంత దమ్ము ఉన్నట్లు.

బాగా ట్రయిన్ అయ్యిన కొన్ని రోజులకి ఫ్రెష్ గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూయర్ కరచాలనం చెయ్యటానికిచెయ్యి ఇవ్వగానే గజేంద్ర మోక్షం లో ఏనుగు కాలుని మొసలి పట్టుకున్నట్లు పట్టుకుని, పిసికి పిప్పి చేసివదిలి పెట్టాను.

తర్వాత దాదాపు అన్ని ప్రశ్నలు బాగానే ఆన్సర్ చేసాను. చివరి లో చాలా ఇంటర్వ్యూలలో మనల్ని తికమక పెట్టే ప్రశ్నలు రెండు వేశాడు.

ప్రశ్న: నిన్నే ఎందుకు ఈ కంపనీ లో తీసుకోవాలి?
(నా అంతరంగం లో జవాబు: నాకు పని కావాలి, నీకు పనోడు కావాలి. నాకంటే తెలివైన వాడికి నువ్వు జీతం ఇవ్వలేవు, నాకంటే వెధవని పెట్టుకునే రిస్కు చెయ్యలేవు కనుక)
బయటకి మాత్రం, "నేను 64 కళలని పోషించిన ఘన చరిత్ర కలవాడను. సంస్కృత ఆంధ్రలలో ను, వ్యాకరణమీమాంసలలోను, చతుర సంభాషణలలోను, వేదాంత వ్యాఖ్యానాలలోను, జాగ్రఫీ, గీగ్రఫీ, అర్ధమెటిక్స్, పావుమెటిక్స్లాంటివి హడలేసి చెప్పుటలోను, నెపోలీయన్ ఆఫ్ యాంటీ నాచ్ అయిన గిరీశం వంటివాడిని ...." లాంటి నాలుగైదు డవిలాగులు వదలగానే ఇంటర్వ్యూయర్ గట్టిగా అవలించి, "నీ లాంటివాళ్ళు యెకరానికి యాభై మంది దొరుకుతారు. నీ గొప్ప యేంటి?" అన్నాడు. (ఇది ఒక టాక్టిక్ అని నాకు తర్వాత తెలిసింది. మనల్ని ఎంత కిందకి చేసి మనకి చూపిస్తే మనం అంత తక్కువకి జీతం నంబర్ పడేస్తాం)

నేను ఏమి చెప్పాలో తెలీక, "ఖాళీ సమయాల్లో మీకు కాళ్ళు పడతాను" అని చెప్పి నాలిక కరుచుకున్నాను.
వైద్యుడు ఇచ్చేది రోగి కోరేది ఒకటే అయ్యింది.

వెంటనే తరవాతి ప్రశ్న అడిగాడు జీతం ఎంత రావాలనుకుంటున్నావు. ఈ ప్రశ్న కి మాత్రం సంకోచించకుండా, తటపటాయించకుండా ఒక 20 టు 25 అని చెప్పాను. (నావుద్దేశ్యము 20,000 - 25,000 అని).

అంతే ఉద్యోగం వచ్చేసింది. తరవాతి రోజు ఆఫర్ లెటర్ ఇచ్చారు. జీతం 2225 రూప్యములు. నేను ఖంగు తిన్నాను. "డబ్బిచ్చువాడు వైద్యుడు" లాంటి అసంబద్ధ సామెతలు కనిపెట్టింది ఈ కంపెనీ లాంటివాడే అయ్యిఉంటాడు. ఎంతటి లత్తుకోరు కంపెనీ ఐనా ఈ 21 వ శతాబ్దం లో కనీసం 10,000 తో మొదలు పెడుతున్నారు. ఈ కసాయి వాడు నన్ను చాలా చీప్ గా కొనేసాడు.

అందుకే ఆ తర్వాత యే ఇంటర్వ్యూలకి వెళ్ళినా నా జీతాన్ని సుస్పష్టంగా చెప్తూ ఉంటాను.

Saturday, June 19, 2010

అరాళ కుంతలా

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా
చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద
అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.
"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.
ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి
"నీ పేరు" అన్నారు.
-చక్రపాణి-
"గోత్రం"
-అరాళ కుంతల-
పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.
"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా
ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

Thursday, January 14, 2010

చిన్న పద్యం

తారే జమీన్ పర్ చూసినప్పుడు కలం కదిలి ఇలా అయ్యింది

బుడిబుడి అడుగుల తడబడి
నిలబడి పరుగెడి బుడతడి
శిరమున వొరవని చదువులు జొరపగనేల
చిరుచిరు పసిపసి చిగురులు
విరిసిన బుజిబుజి మొక్కలు
కడివెడు ఎరువకు ఘడియకు పళ్ళీగలవా?