Saturday, September 6, 2008

I 'Am' A'Way'

నమస్కారం

ఉభయ కుశలోపరి. ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ప్రపంచమంతా సమస్యల మయం నువ్వు కొత్తగా చెప్పేది ఏమిటని అలా తీసి పారెయ్యకండి. ఆ సమస్య చెప్పేముందు కొంచెం దానికి ఉపోద్ఘాతం ఎంతైనా అవసరం. అది విని మీరే చెప్పండి.


ఇది వరకు అమెరికా లో ఎక్కడైనా మన వాళ్ళు కనపడగానే అదో తెలియని ఆనందం వచ్చేది. కానీ ఈ మధ్య ఎవరైనా కనపడితే భయం వేస్తోంది. అందునా ఉత్తర భారత దేశీయులు కనపడితే వీలైనంత దూరం గా పారిపోదాం అనిపిస్తోంది. అపార్ధం చేసుకోకండి. నాకు ఎదురైనా అనుభవాలు మీకు ఎదురైతే మీరూ అలాగే అంటారు ఇది నా గఠ్ఠి నమ్మకం.

అసలు విషయం యేమిటంటే, ఒక రోజు నేను ఒక కూరల మార్కెట్ కి వెళ్ళినపుడు ఒక ఉత్తర భారతీయుడు ఒకడు వచ్చి హాయ్! అన్నాడు. సరేలే అమెరికా లో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకీ కూడ హాయ్ చెప్పటం మర్యాద అని నేను కూడ హాయ్ అన్నాను. అలా మాటలడుతూ నా ఫోన్ నంబరు తీసుకున్నాడు.


ఒక రెండు రోజుల తర్వాత ఫోన్ చేసాడు. ఒక్ మంచి బిసినెస్ మీటింగ్ జరుగుతోంది నువ్వు కూడా రా అన్నాడు. సరే ఆ మీటింగ్ జరిగే స్థలం కూడా నాకు ఇంటికి దగ్గర గా ఉండడం తో సరే అన్నాను. తీరా వెళ్ళాకా అది AMWAY వాళ్ళ మీటింగ్. ఒక 3 గంటలు వాయించాక వదిలారు. హమ్మయ్య అని ఇంటికి చేరుకున్నా. ఐతే వాడు మళ్ళి ఒక రోజు ఫోన్ చేసాడు. మొన్న జరిగిన మీటింగ్ లో ఎమైనా అనుమానాలున్నయా అని అడిగాడు. అది ఏమైనా నా కోర్సు సబ్జెక్టా? లేదు బానే ఉంది అన్నాను. సరే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అన్నాడు. నాకు అర్ధం కాలేదు. ఒక టైం పెట్టుకుని మళ్ళీ మళ్ళి కలవడానికి అది ఎమైనా సంగీత కచేరి నా? బుర్ర వాచిపొయే మీటింగు. నావల్ల కాదు అన్నాను. ఐతే నీకు డబ్బులు సంపాదించాలని లేదా అన్నాడు. దానికి దీనికి ఎంటి సంబంధం అని అడిగాను. ఆ AMWAY అనేది ప్రపంచం లో చాలా పాపులర్ అని చాల మంది దాంట్లో సభ్యులని నన్ను కూడ చేరమని చెప్పాడు. నావల్ల కాదు, నన్ను వదిలేయమన్నాను. సరే అని ఫోన్ పెట్టేసాడు.

ఒక రోజు పొద్దున్నే ఆరు గంటలకి ఫోన్ చేసాడు. ఒక మహానుభావుడు చికాగో వచ్చాడు కలవడానికి వస్తావా అన్నాడు. నేను నిద్ర మత్తులో ఉన్ననో ఎమో కొంపదీసి వివేకానందుడు మళ్ళీ పుట్టి నా కోసం చికాగో రాలేదు కదా అనుకున్నను. సరే వస్తా అన్నాను. ఆ మహానుభావుడు ఈ AMWAY లో ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన వాడు. వాడో 4 గంటలు చంపాడు. బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి వచ్చాను. వీడు మళ్ళి ఫోన్ చేసాడు. నిన్నటి ఉపన్యాసం లో ఎమైనా అనుమానలున్నాయ అని అడిగాడు. వార్నీ వీడికెమైనా పిచ్చా అనుకున్నాను. ఏమి లేవు నన్ను వదిలెయ్యమన్నాను. నీకు జీవితం లో పైకి వెళ్ళాలని లేదా అన్నాడు. అదేంటి అన్నాను. AMWAY అనేది కేవలం కష్టపడి పనిచేసేవాళ్ళకే అన్నడు. మంచిది ఐతే నన్ను ఏమి చెయ్యమంటావ్ అన్నాను. వచ్చి AMWAY లో చేరమన్నడు. సరే వాడి గోల వదిలించు కుందాం అని MS అయ్యక చెరుతా అన్నా. నీ మీద నీకు నమ్మకం లేదు అన్నాడు. ఎరా వళ్ళు తిమ్మిరిగా వుందా ఎమి మాట్లడుతున్నావ్ అన్నాను. అసలు నీకు నమ్మకం లేదు కాబట్టే నీ అసలు వృత్తి ని వదిలేసి ఈ AMWAY లు అవి అంటూ తిరుగుతున్నావ్ అని చీవాట్లు పెట్టాను. ఐనా వాడు వినలేదు. ఇంకా నన్ను వొప్పించడానికే ప్రయత్నిస్తున్నాడు. ఇంక భరించ లేక ఫోన్ పెట్టి నంబరు బ్లాక్ చేసాను. వాడి దుంప తెగ వాడు ఒక వారం ఆగి ఇంటికి వచ్చేసాడు. ఇంక ఓపిక నశించి వాడిని తిట్టేసాను.

ఇది జరిగి ఒక నెల అయ్యింది. మొన్న ఒక షాపు కి వెళ్ళి నపుడు ఇంకోడు ఎవడో కలిసి హాయ్ అన్నాడు. అనుమానం గా నేను కూడా హాయ్ అన్నాను. వాడు కూడా ఇదే బాపతు అని తెలియటానికి ఎంతో సేపు పట్టలెదు. అక్కడనుండి తప్పించుకున్నాను. అసలు వీళ్ళ గోల ఎంటా అని మొన్న రీసెర్చు చేసా. ఈ AMWAY వాళ్ళది ఒక గ్రూపు అని, మళ్ళీ వాళ్ళలో వాళ్ళకే పోటీ అని, ఇలా దొరికిన వాళ్ళని, మీరు చేసేది సరైన ఉద్యొగం కాదు దీంట్లో చేరితే బాగా డబ్బులు వస్తాయ్ అని మనకి ఓపిక శాతం సున్న అయ్యేవరకూ తింటారని నా స్నేహితుడు చెప్పాడు. వ్యాపారం చేయటం మంచిదే కాని ఇలా దొరికిన వాళ్ళని దొరికినట్లు తినెయ్యటం తప్పు. ఒకప్పుడు ఇన్ష్యూరెన్స్ యేజెంట్లు ని చూస్తే జనాలు పారిపొయే వాళ్ళని మా నాన్నగారు చెప్పే వారు. ఇప్పుడు వీళ్ళని చూస్తే వాళ్ళె వందరెట్లు నయం అని అనిపిస్తొంది.


కాబట్టి మిమ్మలని ఎవరైనా వాళ్ళకి రూపాయి లాభం లేకుండా పరిచయం చేసుకుని ఫోన్ నంబర్ అడిగితే వివరాలు జాగ్రత్త గా తెలుసుకుని అప్పుడు ఇవ్వలా వద్దా అలోచించమని మనవి. ఎందుకంటే ఒక్కో సారి మనతో నిజం గా స్నేహం చెయాలనుకునే వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు.

ఇట్లు
మీ శ్రేయోభిలాషి
చక్రి

8 comments:

Anonymous said...

I 'AM' A 'WAY' అని కోట్స్ లో పెట్టి మరీ టైటిల్ కనబడితే ఇదేదో 'I think there I am' అన్న Descartes లైన్స్ లో మాంఛి ఫిలాసాఫికల్ ఆర్టికల్ ఏమో అని ఆతృంగా ఓపెన్ చేసా. హు:(

ఈ మధ్యన వీళ్ళ దాడి తగ్గిందే?. అయినా మీరు రెండు మీటింగ్స్ కెలా వెళ్ళారండి బాబూ?

వర్మ said...

అమ్మో ... ఇకనుండి మేమూ జాగ్రత్తగా ఉంటాం. .

Sujata M said...

Hi .. దీన్ని బట్టి మీరింకా లేలేత అమాయకులని తెలిసింది. మేము ఈమధ్యనే ఢాంవే అని కొత్త కంపనీ పెట్టేము. మేము అమ్మే క్రీము 100 గ్రాములు పదివేల్రూపాయలు. కానీ దీన్ని రాసుకుంటే, రజనీకాంత్ అంతటి సూపర్ స్టార్ అయిపోవచ్చు. కావాలంటే, మీకో సినిమా (ఢాంవే గురించి) చూపిస్తాం రండి.

సింపుల్ అండ్ సూపర్ !

చదువరి said...

ఈ యామ్‌వే కు మనవాళ్ళు బానే బలౌతున్నట్టున్నారు. చరసాల ప్రసాద్ కూడా అభిమానం అమ్మకానికి అంటూ ఈ విషయమ్మీద గతంలో ఓ జాబు రాసారు. ఈ యామ్‌వే దాడిని సమర్ధంగా ఎదుర్కొన్న ఒకాయన మంచి వ్యాఖ్య రాసారక్కడ. :)

Unknown said...

అసలు మీకు meeting కు పొవాలని కొరిక ఎలా కలిగి౦ది.జనాలని ఇ౦త త్వరగా నమ్ముతారా!

Raj said...
This comment has been removed by the author.
Raj said...

Amway మోసాలను వివరించే పుస్తకం గురించి వ్రాసిన నా టపా లంకె ఇక్కడ ఇస్తున్నాను. http://raj-wanderingthoughts.blogspot.com/2008/04/amway.html. వీరితో జాగ్రత్తండి.

రాధిక said...

neanuu aa bhitulloa okadaannea.