Tuesday, September 21, 2010

జాబు - జవాబు - జీతం

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఈ సామెత జాబ్ ఇంటర్వ్యూస్ కి ఖచ్చితం గా సరిపోతుంది.

నా జీవితం లో మొట్ట మొదట ఇంటర్వ్యూకి హాజరు అయ్యినది, నా 18 ఏళ్ళ వయస్సులో నేషనల్ డిఫెన్స్ సెలక్షన్స్ కి వెళ్ళినప్పుడు. అస్సలు అనుభవం లేని నేను, ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి నా ఆహార్యం తోనే మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలని అన్నీ హంగులు చేసి, కాస్త దైవ భక్తి ఉన్నట్లు కనపడితే ఇంకొంచెం ఎక్కువ మార్కులు నొక్కెయ్యొచ్చని, మా ఊరి గుళ్ళో రామప్ప ప్పంతులుగారు పెట్టుకున్నట్లు పొడుగు బొట్టు పెట్టుకుని ఠీవిగా ఆ హాలులో ప్రవేశించాను.

ఇంటర్వ్యూయర్ నన్ను చూడగానే, "నీ నుదిటి మీద రక్తం వస్తొంది.... ఏం జరిగింది?" అని అడిగారు. నేను నా భక్తిభాగోతం చెప్పగానే ఆయన, "భక్తి తో భారత దేశాన్ని కాపాడేద్దామని వచ్చావా నాయనా? సరే కూర్చో" అన్నారు. కాసిని వ్యక్తిగత ప్రశ్నలు అడిగిన తర్వాత, కొన్ని సిచుయేషనల్ ప్రశ్నలు అడిగారు.

ప్రశ్న: "నువ్వు అడివిలో వెళుతున్నావు. నీకు ఒక పులి ఎదురైంది. అది బాగా ఆకలి మీద ఉంది. నువ్వు నీరసం గా ఉన్నావు. అప్పుడు ఏమి చేస్తావు?"
నేను: "నాకు వచ్చే జన్మ లో ఐనా ఇలా ఇంటర్వ్యూలకి వెళ్ళే దౌర్భాగ్యం కలగకుండా బాగా ఆస్తిని ఇవ్వమని కడసారి గా దేవుణ్ణి ప్రార్ధిస్తాను."

ప్రశ్న: "మీఇంట్లొ నువ్వు ఏదైనా పనులు చేస్తూ ఉంటావా?"
నేను: "ఆయ్!!!!! మా అమ్మగారిని అసలు కాలు కింద పెట్టనివ్వనండి." 

దానికి ఆయన, "ఔనా!!!!!!!! మీఇంట్లో నీ బట్టలు ఎవరు ఉతుకుతారు నాయనా?" అన్నారు.
నేను: "మా అమ్మగారండి." అని నాలిక కరుచుకున్నాను. (దీన్నే contradicting your own statement అంటారని తరవాత తెలిసింది)
యేది యేమైనా నా నిజాయితీ, పాజిటివ్ ఆటిట్యూడ్, భవిష్యత్ ప్రణాళికలు చూసి నన్ను సెలక్ట్ చేస్తాడు అనుకున్నా, కానీ సెలక్ట్ కాలేదు.

(4 సంవత్సరాలు తర్వాత.........)
నా ఆర్కిటెక్చర్ పూర్తి అయ్యింది, ఒక కంపెనీ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పటికి కూడ నాకు ఇంటర్వ్యూ ని సమర్ధవంతం గా ఎదుర్కొనే యుక్తులు వంటబట్టలేదు. నా ఇంటర్వ్యూ మొదలయ్యింది.

ప్రశ్న: "నీ గురించి చెప్పుకో"
నేను: "ఎవరి పేరు చెపితే సీమ ప్రజలు ....."
నన్ను ఆపి, "చిరంజీవి గురించి కాదు. నీ గురించి చెప్పు" అన్నాడు.
నేను తెలుగు మహాభారతం లోని, "ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు, రాజభూషణ రజో రాజినడగు ..." అనే ధర్మరాజుని పొగిడే పద్యం స్టార్ట్ చేసాను.
ఆయన తల పట్టుకుని, "కొంచెం తెలుగు లో చెప్పు బాబు." అన్నారు.
"నేను ఒక ఆర్కిటెక్ట్ ని" అన్నాను.
ఆయన, "ఆర్కిటెక్ట్ అంటే?" అన్నాడు.

నేను వెంటనే, "ఆర్కిటెక్ట్ అంటే....ధాతా రాతిరాతిర్ధాతా, ధాత రాతి సవితా సవితా. రాతిర్ధాత ధాత రాతిర్ సవితా రాతిర్ సవితా సవితేదం ఇదం సవితా........" అన్నాను.

ఇంటర్వ్యూయర్ భరించలేక నా రెస్యూమె లోని మొదటి పేపర్ ని చింపేసి, చిరాగ్గా మొహం పెట్టి, "నీ బలాలుబలహీనతలు ఏంటి?" అని అడిగాడు.
ఎంతో కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ ఐతే అసలు కోర్స్ కి సంబంధించిన ప్రశ్నలుమానేసి దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతున్నాడని నాకు చిరాకొచ్చింది.
నేను: "బలం: హనుమాన్ చాలీసా; బలహీనతలు: ఇలియానా, జెనీలియా" అన్నాను.

నాకు ఆ ఉద్యోగం రాలేదు. ఈ సారి "How To crack interviews?" అనే కోచింగ్ చెంటర్ లో చేరాను. వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎక్కడికి వెళ్ళినా కోర్స్ కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే కాకుండా, కొన్ని రొటీన్, ప్రశ్నలు ఉంటాయి. "నీ గురించి చెప్పు", "నీ బలహీనతలు ఏంటి", "నీ బలాలు, బలగాలు ఏంటి" లాంటివి. అసలు కరచాలనం లోనే మన వ్యక్తిత్వం తెలిసే సైన్సు ఎదో ఒకటి ఉందని అప్పుడే తెలిసింది. కరచాలనం ఎంత బలంగా ఇస్తే మనకి అంత దమ్ము ఉన్నట్లు.

బాగా ట్రయిన్ అయ్యిన కొన్ని రోజులకి ఫ్రెష్ గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూయర్ కరచాలనం చెయ్యటానికిచెయ్యి ఇవ్వగానే గజేంద్ర మోక్షం లో ఏనుగు కాలుని మొసలి పట్టుకున్నట్లు పట్టుకుని, పిసికి పిప్పి చేసివదిలి పెట్టాను.

తర్వాత దాదాపు అన్ని ప్రశ్నలు బాగానే ఆన్సర్ చేసాను. చివరి లో చాలా ఇంటర్వ్యూలలో మనల్ని తికమక పెట్టే ప్రశ్నలు రెండు వేశాడు.

ప్రశ్న: నిన్నే ఎందుకు ఈ కంపనీ లో తీసుకోవాలి?
(నా అంతరంగం లో జవాబు: నాకు పని కావాలి, నీకు పనోడు కావాలి. నాకంటే తెలివైన వాడికి నువ్వు జీతం ఇవ్వలేవు, నాకంటే వెధవని పెట్టుకునే రిస్కు చెయ్యలేవు కనుక)
బయటకి మాత్రం, "నేను 64 కళలని పోషించిన ఘన చరిత్ర కలవాడను. సంస్కృత ఆంధ్రలలో ను, వ్యాకరణమీమాంసలలోను, చతుర సంభాషణలలోను, వేదాంత వ్యాఖ్యానాలలోను, జాగ్రఫీ, గీగ్రఫీ, అర్ధమెటిక్స్, పావుమెటిక్స్లాంటివి హడలేసి చెప్పుటలోను, నెపోలీయన్ ఆఫ్ యాంటీ నాచ్ అయిన గిరీశం వంటివాడిని ...." లాంటి నాలుగైదు డవిలాగులు వదలగానే ఇంటర్వ్యూయర్ గట్టిగా అవలించి, "నీ లాంటివాళ్ళు యెకరానికి యాభై మంది దొరుకుతారు. నీ గొప్ప యేంటి?" అన్నాడు. (ఇది ఒక టాక్టిక్ అని నాకు తర్వాత తెలిసింది. మనల్ని ఎంత కిందకి చేసి మనకి చూపిస్తే మనం అంత తక్కువకి జీతం నంబర్ పడేస్తాం)

నేను ఏమి చెప్పాలో తెలీక, "ఖాళీ సమయాల్లో మీకు కాళ్ళు పడతాను" అని చెప్పి నాలిక కరుచుకున్నాను.
వైద్యుడు ఇచ్చేది రోగి కోరేది ఒకటే అయ్యింది.

వెంటనే తరవాతి ప్రశ్న అడిగాడు జీతం ఎంత రావాలనుకుంటున్నావు. ఈ ప్రశ్న కి మాత్రం సంకోచించకుండా, తటపటాయించకుండా ఒక 20 టు 25 అని చెప్పాను. (నావుద్దేశ్యము 20,000 - 25,000 అని).

అంతే ఉద్యోగం వచ్చేసింది. తరవాతి రోజు ఆఫర్ లెటర్ ఇచ్చారు. జీతం 2225 రూప్యములు. నేను ఖంగు తిన్నాను. "డబ్బిచ్చువాడు వైద్యుడు" లాంటి అసంబద్ధ సామెతలు కనిపెట్టింది ఈ కంపెనీ లాంటివాడే అయ్యిఉంటాడు. ఎంతటి లత్తుకోరు కంపెనీ ఐనా ఈ 21 వ శతాబ్దం లో కనీసం 10,000 తో మొదలు పెడుతున్నారు. ఈ కసాయి వాడు నన్ను చాలా చీప్ గా కొనేసాడు.

అందుకే ఆ తర్వాత యే ఇంటర్వ్యూలకి వెళ్ళినా నా జీతాన్ని సుస్పష్టంగా చెప్తూ ఉంటాను.