Wednesday, October 1, 2008

ధర్మ బధ్ధం గా!!!!

నేను ఈ మధ్యన మానాన్న గారి ప్రోద్బలం తో, ఒక వెబ్ సైట్ లో ఉషశ్రీ మహాభారత శ్రవణం చేసాను. ఎన్నో విషయాలను నిక్షిప్తం చేసిన ఆ మహాభారత ఘట్టాలని ఎంతో ఆశక్తికరం గా మహానుభావులు శ్రీ ఉషశ్రీ గారు వర్ణించారు. ప్రతి సన్నివేశాన్ని కళ్ళకి కట్టినట్లు వర్ణించటం ఆయన గొప్పదనం. నేను ఖాళి సమయాల్లో వింటున్నప్పుడు నా స్నేహితులు కూడా ఆశక్తి చూపించటం మొదలు పెట్టారు. అలా మళ్ళీ దాని మీద చర్చలు. మొత్తానికి అందరికీ ధర్మాన్ని మించిన దైవం లేదని ధర్మ బద్ధం గా ఏ పని చేసినా దానికి దోషం అంటదని ఇలా ఎవరికి తోచిన విధం గా వాళ్ళు సమాధానాలని వెతుకున్నారు ఆ మహభారత శ్రవణం లో.

ఇది ఇలా ఉండగా ఒక రోజు మా మిత్ర బృందం లోనే ఒకడు బిరియాని చేసాడు వాళ్ళ ఇంట్లో. అందరికీ ఫోన్లు చేసి ఈ రోజు మా ఇంట్లో బిరియాని చేసాను తినడానికి రమ్మని ఆహ్వానాలు పంపాడు. సరే అమెరికా లో పిలిచి బిరియాని పెడతానంటె, వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవటం ఇష్టం లేక అందరం వెళ్ళాము. వాడు చేసిన బిరియాని గొరంత చేసిన హడావిడి కొండంత. పైగా అది వాళ్ళ రూం లో ఆ రోజు రాత్రి మిగిలిపోయిన అన్నం తో వండినది. తినటానికి కనీసం బాలేదు సరికదా ఆ బిరియాని ని తీర్చి దిద్దటం లో వాడి ఘనత అదే పని గా ఏకరువు పెట్టాడు. అంతే కాక మాకు ఏదొ దానం చేస్తున్న ఫీలింగ్ తో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇంక వాడి అతి ని భరించలేక ఏదొ అయ్యిందనిపించి ఇంటికి వచ్చాము. కాని మా రూం మేట్ పవన్ అని, ఈ అవమానాన్ని భరించలెకపోయాడు. వాడు చేసిన దానికి ప్రతి గా మనం కూడ ఏదైనా చెయ్యాలని ఆవేశపడ్డాడు. సరే చేద్దామని వాడిని ఓదార్చి, ఇన్ని రోజులు గా భారత శ్రవణం మూలాన అబ్బిన ధర్మ సూత్ర్రాలని మధనం చేసి, అబద్దం ఆడిన దోషం రాకుండా, మోసానికి మోసం చెయ్యలని తీర్మానించాం. ఐతే ఈ రసవత్తర సన్నివేసానికి ఆజ్యం పోసిన ఆ భారత ఘట్టం, ధర్మరాజు అసత్య దోషం లేకుండా అన్న "అశ్వధ్ధామ హత:(కుంజరహ)"

ఆ రోజు రానే వచ్చింది మా రూం లో బిరియాని చేసాం. అనుకోకుండా అది చాలా బాగా వచ్చింది. మొన్న అవమాన పరిచిన వాడికి ఫోన్ చేసి "మా రూం లో బిరియాని (ఐపోయింది)" వచ్చెయ్ అన్నాం. వాడు తయారయ్యి వచ్చెలోపు మొత్తం తినేసాం. వాడు వచ్చేటప్పటికి అడుగు మాడిన బిరియాని మిగిలింది, వాడు ఇంక చేసేది లేక అదేతిన్నాడు. మా పగపట్టిన పవన్ గాడు వాడికి కనీసం పెరుగు చట్నీ కూడా మిగల్చలేదు. వాడు తింటున్నంత సేపు ఆ బిరియాని గొప్పదన్నాన్ని వేనొళ్ళ కీర్తించాము. వాడు మొహం మాడ్చుకుని వెళ్ళిపొయాడు.

ఐనా మాకు ఎలాంటి దోషము అంటలేదు. ఎందుకంటే మేము చేసిన అవమానం ధర్మ బద్ధం గా!!!!! చేసినది.